కొత్తూరు రూరల్, జూన్ 11 : రైతుల కష్టాలను తీర్చేందుకు సీఎం కేసీఆర్ రెవెన్యూ ప్రక్షాళన చేపట్టి ధరణి పోర్టల్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. కొన్నేండ్లుగా పరిష్కారానికి నోచుకోని డాక్యుమెంట్, మ్యుటేషన్, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు, విరాసత్, నాలా, పార్టీషన్ వంటి భూ సమస్యలు నేడు సులభతరంగా పరిష్కారమవుతున్నాయి. గతంలో గుంట, రెండు గుంటల భూమి కొనాలన్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ఇటు అధికారులకు, అటు మధ్యవర్తులకు ఇచ్చే ఖర్చులు భారమయ్యేవి. రైతులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి, తర్వాత డాక్యుమెంట్ కోసం రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరిగేవారు. మ్యుటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాల కోసం వీఆర్వోల చుట్టూ తిరిగి అలసిపోయేవాళ్లు.
పెరిగిన రిజిస్ట్రేన్లు..
ఎటువంటి అధిక చార్జీలు లేకుండా రిజిస్ట్రేషన్లు అవుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు అనుకూలమైన రోజు, సమయాన్ని స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. 2020 సంవత్సరంలో నవంబర్, డిసెంబర్ నెలలో మొత్తం 178 రిజిస్ట్రేషన్లు కాగా, 2021లో మ్యుటేషన్లు, పార్టీషన్, నాలా కన్వెర్షన్లు, నాలా విత్అవుట్ పట్టాదారు పాస్‌బుక్, సెమీఅర్బన్ ల్యాండ్, సక్సేషన్, రిజిస్ట్రేషన్లు మొత్తం కలిపి 2,289 కాగా, ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో మ్యుటేషన్లు, పార్టీషన్, నాలా కన్వెర్షన్లు, నాలా విత్ అవుట్ పట్టాదారు పాస్‌బుక్, సెమీఅర్బన్ ల్యాండ్, సక్సేషన్, రిజిష్ర్టేషన్లు మొత్తం కలిపి 976 అయ్యాయి.
దళారుల ప్రమేయం లేదు…
భూ రిజిస్ట్రేషన్‌లో మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేదు. అరగంటలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. గతంలో వారం రోజులు పట్టేది. మ్యుటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాల కోసం మరో నెల రోజులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది.
చకచకా రిజిస్ట్రేషన్లు..
ధరణి పోర్టల్ ద్వారా భూముల రిజిష్ర్టేషన్లు చకచకా పూర్తయ్యాయి. తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పనులు పారదర్శకంగా అరగంటలోనే పూర్తవుతున్నాయి. డాక్యుమెంట్, మ్యుటేషన్, పట్టాదారు పాస్‌బుక్ అన్ని ఒకే రోజు అవుతుండడం సంతోషకరం.
-బాబులాల్, కొత్తూరు, కొత్తూరు మండలం
క్షణాల్లోనే ఆన్లైన్లో..
మాది హైదరాబాద్. పెంజర్ల గ్రామంలో 4 ఎకరాల భూమి కొన్నా. అరగంటలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. అధికారులు భూమికి సంబంధించిన డాక్యుమెంట్‌ను క్షణాల్లోనే ఆన్లైన్ చేశారు. ఇంత త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తవడం చాలా సంతోషంగా ఉన్నది.
– చంద్రశేఖర్, మెహిదీపట్నం, హైదరాబాద్