ఇబ్రహీంపట్నం, జూన్ 10 : గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారు. పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం వెల్లువిరుస్తుంది. దీంతో డెంగీ, మలేరియా వంటి వ్యాధులతో పాటు ఇతర వ్యాధులు కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. గతంలో జనావాసాల మధ్య కుక్కలు, పందులు స్వైరవిహారం చేసేవి. పట్టణ ప్రగతితో ఇటీవల రోడ్లపై ఎక్కడా చెత్తాచెదారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నగరశివారులల్లోని రంగారెడ్డిజిల్లాలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామాల్లో పట్టణ ప్రగతి ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టణప్రగతి కార్యక్రమంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అలాగే, హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో గ్రామాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. పట్టణ, పల్లె ప్రగతితో గ్రామాలు స్వచ్ఛతవైపు అడుగులు వేస్తుండగా, పట్టణాలు సంపూర్ణ పారిశుధ్యంలో పరుగులు పెడుతున్నాయి. రోడ్లపై చెత్తాచెదారం వేయకుండా అధికారులు, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ముమ్మరంగా పారిశుధ్యం..
రంగారెడ్డిజిల్లాలో ఐదోవిడుతలో చేపట్టిన పల్లె ప్రగతితో పారిశుధ్యం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రతినెలా గ్రామాలు, పట్టణాలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులతో గ్రామాల్లో పారిశుధ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్లు మున్సిపాలిటీలకు సంబంధించిన పారిశుధ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. ఈ చెత్తద్వారా కంపోస్టు ఎరువును కూడా తయారుచేస్తున్నారు. ప్రతి గ్రామపంచాయతీకో ట్రాక్టర్ కొనుగోలు చేసుకుని చెత్తను సేకరిస్తున్నారు. అలాగే, రోడ్లపై కూడా ఎలాంటి చెత్తలేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 14మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో కూడా పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతినెలా మున్సిపాలిటీ చొప్పున రూ.10 నుంచి రూ.15లక్షల వరకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఈ నిధుల్లో ఎక్కువభాగం పారిశుధ్యానికే వినియోగిస్తున్నారు. మురికి కాల్వలను తొలగించి భూగర్భడ్రైనేజీలు ఏర్పాటు చేయడంతో దోమల బెడుద లేకుండా పోయింది.
విస్తృతంగా వైద్యారోగ్యశాఖ ప్రచారం..
సీజనల్ వ్యాధులపట్ల కూడా వైద్యారోగ్యశాఖ అధికారులు విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు రోడ్లపై చెత్తను వేయకూడదని గ్రామాల్లో ఏఎన్ఎమ్లు, ఆశవర్కర్లు, ఇతర పారిశుధ్య సిబ్బంది వివరిస్తున్నారు. పట్టణ, పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పారిశుధ్య పనులతో సీజనల్ వ్యాధులు దరిచేరకుండా చర్యలు తీసుకుంటున్నారు. కళాబృందాలు పాటల ద్వారా పారిశుధ్యంపై గ్రామగ్రామాన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
పారిశుధ్యానికి ప్రాధాన్యం
ప్రభుత్వం పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి పర్చాలన్న ఉద్దేశంతో చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడటంతో సీజనల్గా వచ్చే వ్యాధులు దూరమయ్యాయి. ముఖ్యంగా గతంలో రోడ్లపై మురుగునీరు, చెత్తాచెదారం వలన ఈగలు, దోమలు ప్రబలి పలురకాల వ్యాధులు వ్యాపించేవి. కాని, ప్రభుత్వం చేపట్టిన పారిశుధ్యం, పచ్చదనం వంటి కార్యక్రమాలతో వ్యాధులు దూరమయ్యాయి.
– స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్వో