నేడు చికిత్స కన్నా వైద్య పరీక్షలకే అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ సర్కార్.. టీ-డయాగ్నస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. వికారాబాద్‌లో రూ.3.50కోట్ల వ్యయంతో ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేయగా.. 2021 జూన్ 9వ తేదీ నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి నిన్నటివరకు అంటే ఏడాదికాలంలోనే 30,862 మందికి రూ.9కోట్లు విలువ చేసే 5,66,777 టెస్టులు ఉచితంగా చేసి రికార్డు సృష్టించారు. అంతేకాకుండా శాంపిల్స్ సేకరించిన 24 గంటల్లోనే రోగుల సెల్ఫోన్లకు మెసేజ్ ద్వారా వైద్య పరీక్షల ఫలితాలు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సెంటర్లో మొత్తం 57 రకాల పరీక్షలు చేస్తుండగా, 32 దవాఖానల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. వికారాబాద్ డయాగ్నస్టిక్ సెంటర్ జాతీయ స్థాయిలో నంబర్-1 స్థానంలో నిలిచింది. తక్కువ పడకలు గల చిన్న దవాఖానల కేటగిరీలో శాంపిల్స్ సేకరణ, పరీక్షలు చేయడం, రిపోర్టులు పంపించడంలో ఉత్తమ సేవలందిస్తున్న సెంటర్లకు కేంద్రం గత అక్టోబర్‌లో ర్యాంకులు కేటాయించగా.. మన డయాగ్నస్టిక్ సెంటర్ అగ్రస్థానం దక్కించుకున్నది.
-పరిగి, జూన్ 8
పరిగి, జూన్ 8 : పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడంతోపాటు ఉచితంగానే వైద్య పరీక్షలు అందించే సత్సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా ఏడాది కాలంలో సుమారు రూ.9కోట్ల విలువ చేసే వైద్య పరీక్షలు పేదలకు అందాయి. ప్రస్తుతం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లినా ముందుగా వైద్య పరీక్షలు రాయడం, వాటి ఆధారంగానే చికిత్స చేయడంతోపాటు మందులు రాసిస్తారు. ఒక్కోసారి వైద్యుడి ఖర్చు కంటే అనేక రెట్లు వైద్య పరీక్షలకు డబ్బులు ఖర్చవుతుంటాయి. ఈ నేపథ్యంలో పేదలకు సర్కారు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఉచితంగా వైద్యసేవలపై దృష్టి నిలిపింది.
53,460 శాంపిల్స్ సేకరణ
వికారాబాద్‌లో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్లో ఏడాది కాలంలో 2021 జూన్ 9 నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు 5,66,777 వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందుకుగాను 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర దవాఖానల ద్వారా సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించి ఫలితాలు వెల్లడించారు. ఏడాదిలో 30,862 మంది నుంచి 53,460 శాంపిల్స్ సేకరించి 78,290 వైద్య పరీక్షలు నిర్వహించారు. వికారాబాద్ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు రూ.9కోట్ల విలువ చేసే వైద్య పరీక్షలు ఉచితంగానే అందించారు. ప్రస్తుతం డయాగ్నస్టిక్ సెంటర్లో 57 రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తుండగా.. త్వరలో వందకు పైచిలుకు వైద్య పరీక్షల నిర్వహణకు సర్కారు సన్నాహాలు చేస్తున్నది.
వైద్య సేవలపై ప్రజల హర్షాతిరేకం
వికారాబాద్‌లోని డయాగ్నస్టిక్ సెంటర్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. డయాగ్నస్టిక్ సెంటర్‌కు శాంపిల్స్ చేరుకున్న 24 గంటల్లోనే వాటిని పరీక్షించి, అందుకు సంబంధించిన ఫలితాలను వెల్లడిస్తారు. ఎల్డీహెచ్, డీ డైమర్, హెచ్‌బీఏ1సీ వంటి సేవలపే సైతం ఈ డయాగ్నస్టిక్ సెంటర్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు సుమారు 400 నుంచి 500 వరకు టెస్టులు నిర్వహిస్తున్నారు. సోమవారం, శుక్రవారం ఏఎన్సీ పరీక్షల కోసం గర్భిణులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చారు. ఈ రెండు రోజుల్లో 500 పైచిలుకు టెస్టులను నిర్వహించారు. వైద్య పరీక్షల ఫలితాలను మొబైల్ ఫోన్‌కు మెసేజ్ రూపంలో పంపించడంతోపాటు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రింటెడ్ పత్రాల్లో అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రింటర్లు ఉన్న ఆసుపత్రుల్లో ఇప్పటికే వైద్య పరీక్షల ఫలితాలను సంబంధిత వ్యక్తులకు ప్రింట్ తీసి అందిస్తున్నారు. మిగతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సైతం ప్రింటర్లను అందజేయనున్నారు. వేలాది రూపాయల ఖర్చుతో కూడుకున్న వైద్య పరీక్షలు తక్కువ సమయంలో ఉచితంగా నిర్వహించడంతోపాటు 24 గంటల వ్యవధిలో ఫలితాలు వెల్లడించడం.. డయాగ్నస్టిక్ సెంటర్లో అందుతున్న సేవలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
జాతీయ స్థాయిలో గుర్తింపు
వికారాబాద్ డయాగ్నస్టిక్ సెంటర్ జాతీయ స్థాయిలో నం.1 స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో రెండు కేటగిరీల్లో ఈ డయాగ్నస్టిక్ సెంటర్‌ను ఎంపిక చేయగా తక్కువ పడకలు గల చిన్న దవాఖానల నుంచి శాంపిల్స్ సేకరించి సదరు వ్యక్తులకు సంబంధించిన పూర్తిస్థాయి పరీక్షలు జరిపి వెనువెంటనే వారికి పరీక్షల ఫలితాలను తెలియజేస్తున్నందుకు వికారాబాద్ డయాగ్నస్టిక్ సెంటర్ జాతీయ స్థాయిలో పేరు గడించింది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న, అమలు చేస్తున్న వైద్య విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఏకంగా నీతి ఆయోగ్ కితాబునిచ్చింది. భారత కుటుంబ సంక్షేమ శాఖ, నీతి ఆయోగ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించినటి అధ్యయన ఫలితాలను నీతి ఆయోగ్ గత అక్టోబర్ నెలలో విడుదల చేయగా.. వికారాబాద్‌లోని డయాగ్నస్టిక్ సెంటర్ ఉత్తమ సేవలు అందించడం ద్వారా దేశంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
32 దవాఖానల నుంచి నమూనాల సేకరణ
వికారాబాద్‌లోని టీ డయాగ్నస్టిక్ సెంటర్‌కు 32 దవాఖానల నుంచి శాంపిల్స్ సేకరణ చేపట్టి పరీక్షల నిమిత్తం తీసుకువచ్చారు. జిల్లా పరిధిలోని 22 పీహెచ్‌సీల నుంచి రక్త నమూనాలను సేకరించి ఆర్బీఎస్కే వాహనాల్లో వికారాబాద్ డయాగ్నస్టిక్ సెంటర్‌కు తీసుకువస్తారు. జిల్లాలోని ధారూరు, బంట్వారం, బషీరాబాద్, చిట్యాల, కులకచర్ల, దోమ, పూడూరు, చన్గోముల్, అంగడిరాయచూర్, యాలాల, నవాల్గా, మోమిన్‌పేట్, సిద్దులూరు, రామయ్యగూడ, నవాబుపేట, మర్పల్లి, పెద్దేముల్, నాగసముద్రం, కోట్‌పల్లి, బొంరాస్‌పేట్, కొడంగల్, దౌల్తాబాద్, జిన్గుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల, ఆలూరు, చందన్వెల్లి, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి, కొందుర్గు, టంగటూర్, సంగారెడ్డి జిల్లా మల్చెల్మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రక్త నమూనాలను సేకరించి ఇక్కడికి పంపిస్తారు.
ఉచితంగా వైద్య పరీక్షలు
– డాక్టర్ ప్రదీప్, డీహెచ్క్యూఎస్, వికారాబాద్
వికారాబాద్‌లోని డయాగ్నస్టిక్ సెంటర్లో ఉచితంగా వైద్య పరీక్షల నిర్వహించి ఫలితాలు 24 గంటల వ్యవధిలో తెలియజేస్తున్నారు. ప్రస్తుతం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా.. వాటిని పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అత్యంత ఖరీదైన వైద్య పరీక్షల నిర్వహణ పేదలకు ఆర్థికంగా భారంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో ఉచితంగానే వైద్య పరీక్షలు జరిపి ఫలితాలు వెల్లడిస్తున్నారు. ప్రింటింగ్ రూపంలోనూ ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.