మంచాల, జూన్ 8 : అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తండా నేడు పల్లె ప్రగతితో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. గతంలో లోయపల్లి గ్రామపంచాయతీకి అనుబంధ గ్రామంగా ఉన్న సత్తి తండాలో కుప్పలుతెప్పలుగా సమస్యలుండేవి. ఎక్కడ చూసినా రోడ్లు, డ్రైనేజీలు లేక తండావాసులు అవస్థలుపడేవారు. సీఎం కేసీఆర్ నూతన పంచాయతీగా ఏర్పాటు చేయడంతో పాటు పల్లె ప్రగతి కింద నెలనెలా నిధులు కేటాయించడంతో నేడు అభివృద్ధిలో తండా దూసుకెళ్తున్నది. సత్తి తండాలో 6 వందల జనాభా ఉండగా, అందులో 470 మంది ఓటర్లు ఉన్నారు. తండాలో 8 వార్డులు ఉన్నాయి.
పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామంలోని సమస్యలు పరిష్కారమయ్యాయి. తండాలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, హరితహారం నర్సరీలను ఏర్పాటు చేశారు. నిత్యం పంచాయతీ ట్రాక్టర్‌తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తరలించిన చెత్తను వర్మీ కంపోస్టు ఎరువుగా తయారు చేసి హరితహారంలో నాటిన మొక్కలకు వేస్తున్నారు. హరితహారం మొక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయడంతో పాటు నిత్యం ఉదయం, సాయంత్రం పంచాయతీ ట్యాంకర్‌తో మొక్కలకు నీరు పోసి సంరక్షిస్తున్నారు.
ఇంటింటికీ తాగునీరు..
గతంలో సత్తి తండాలో నానా ఇబ్బందులు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికీ నల్లాలు వేశారు. నిత్యం సరిపడా తాగునీరు సరఫరా అవుతుండడంతో తండాలోని ఆడబిడ్డలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తండాలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మించుకోవడంతో స్వచ్ఛ గ్రామంగా ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగునీటి కాల్వలను నిర్మించారు. వీధిదీపాలు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో తండాలో ఎలాంటి సంఘటన జరిగినా తెలియనున్నది. పంచాయతీ సిబ్బంది ప్రతి రోజూ వీధులను శుభ్రం చేస్తున్నారు. సర్పంచ్ పెంట్యా నాయక్ ప్రతి వార్డులో ఏఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. ప్రతి నెలా వచ్చే ప్రభుత్వ నిధులను పాలకవర్గంతో చర్చించి ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేశారు.
తండాను ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సహకారంతో తండాలోని సమస్యలను పరిష్కరించుకున్నాం. తండాలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వీధి దీపాలను ఏర్పాటు చేసుకున్నాం. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతో తండాను ఆదర్శంగా తీర్చిదిద్దుతా.
– పెంట్యానాయక్, సత్తి తండా సర్పంచ్