ఇబ్రహీంపట్నం రూరల్, జూన్ 6: సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్నదాతల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి మధ్యదళారుల ప్రమేయం లేకుండా పూర్తి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వం పది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని కొంటున్నది. ఇప్పటివరకు 70 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ ముగియనున్నట్లు వారు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లో పది కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి వడ్లను కొంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు చెల్లింపుల్లో జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బిల్లింగ్ పూర్తయిన 24గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నారు. పండించిన ధాన్యానికి గిట్టుబాటు దక్కుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రైతులు నష్టపోవద్దనే..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనబోమని స్పష్టం చేయడంతో ఆరుగాలం కష్టపడిన రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లో కేంద్రాలను ఏర్పా టు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. ఇప్పటికే నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సారథ్యంలో పది కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని కొంటున్నది. ఇబ్రహీంపట్నం మండలంలోని ఇబ్రహీంపట్నం డీసీఎంఎస్, రాయపోల్, ఎలిమినేడుతో పాటు మంచాల మండలంలోని మంచాల, బోడకొండ, యాచారం మండలంలోని యాచారం, చింతపట్ల, అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని అబ్దుల్లాపూర్మెట్, బాచారం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించారు.