ఇబ్రహీంపట్నం, జూన్ 4 : ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి కోసం ప్రభుత్వం రాచమార్గాన్ని ఏర్పాటు చేసింది. ఇబ్రహీంపట్నం పరిసరాల్లో ఏర్పాటైన అనేక రక్షణరంగ సంస్థలతో పాటు మరిన్ని సంస్థల ఏర్పాటే లక్ష్యంగా ప్రభుత్వం పలు రకాల వసతులను కల్పిస్తున్నది. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే బీడీఎల్, ఆక్టోపస్, వైట్‌గోల్డ్, ఎన్ఎస్జీ, ఎన్పీఏతో పాటు క్లస్టర్ పార్కును కూడా ఏర్పాటు చేసింది. ఈ సంస్థలన్నింటికీ ఇబ్రహీంపట్నంతో సంబంధం లేకుండా సాగర్హ్రదారిలోని పెద్దచెరువుకట్టపై గల దర్గా నుంచి ప్రత్యేక నాలుగు లేన్ల రోడ్డును ఏర్పాటు చేసింది. సుమారు రూ.17కోట్ల వ్యయంతో చెరువు కట్టపై నుంచి బీడీఎల్‌ను కలుపుతూ.. క్లస్టర్ పార్కు వరకు ఈ రోడ్డు ఏర్పాటు చేశారు.
ఈ రోడ్డు వల్ల ఇబ్రహీంపట్నం టౌన్‌కు సంబంధం లేకుండా నేరుగా ఈ రక్షణ రంగ సంస్థలకు వెళ్లే మార్గం సుగమమైంది. సుమారు మూడు కిలోమీటర్ల మేర ఈ రోడ్డును ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు వల్ల క్లస్టర్పార్కుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ఎంతో ప్రయోజనం కలుగనున్నది. ఇబ్రహీంపట్నం సమీపంలోని తట్టిఖానా వద్దగల సర్వేనంబర్ 2లో సుమారు వంద ఎకరాల్లో క్లస్టర్పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ భూమిలో కంటి అద్దాల నుంచి హెలికాప్టర్లకు వాడే అద్దాలను ఇక్కడ తయారు చేయనున్నారు. ముఖ్యంగా రక్షణరంగ విమానాలతో పాటు వివిధ యుద్ధ విమానాలకు ఉపయోగించే బులెట్ప్రూప్ గ్లాస్లనూ ఇక్కడ తయారు చేయనున్నారు.
క్లస్టర్ పార్కులో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇందులో స్థలాలను కేటాయిస్తున్నారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఈ భూమిలో రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. దీంతో ఈ క్లస్టర్పార్కులో ఇప్పటికే పరిశ్రమలను ఏర్పాటు చేయటానికి పెద్ద ఎత్తున ముందుకు రాగా, కొంతమంది ఇప్పటికే తమ పరిశ్రమలను ప్రారంభించే వరకు వచ్చారు. దీంతో క్లస్టర్పార్కుకు నేరుగా ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై నుంచి వచ్చిపోయేలా నాలుగు లేన్ల రోడ్డును ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు వల్ల బీడీఎల్‌కు కూడా చక్కటి రోడ్డు మార్గం లభించింది. ఎన్ఎస్జీ, ఆక్టోపస్‌లకు ఈ రోడ్డు నుంచి రాకపోకలు సాగించుకునే అవకాశాలు మెరుగుపడ్డాయి.
రూ.17కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం..
ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై నుంచి సుమారు 3 కిలోమీటర్ల మేర రూ.17కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఈ రోడ్డు వేయడానికి ప్రభుత్వ స్థలంతో పాటు కొంత పట్టా భూములను సేకరించారు. భూ సేకరణ ద్వారా రైతులకు తగిన పరిహారం అందించి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు మార్గంలో ఇబ్రహీంపట్నం బైపాస్ రోడ్డునూ కలిపారు. శేరిగూడ, ఇబ్రహీంపట్నం మధ్యలోని బీడీఎల్‌కు ఇప్పటి వరకు సరైన రోడ్డుమార్గం లేక అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ రోడ్డు ఏర్పాటు వల్ల బీడీఎల్‌కు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడింది. క్లస్టర్పార్కుతో ఎన్ఎస్జీ, ఆక్టోపస్, వైట్‌గోల్డ్ వంటి సంస్థలకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సంస్థలకు వెళ్లాలంటే ఇబ్రహీంపట్నం టౌన్ నుంచి వెళ్లేవారు. దీంతో ఇబ్రహీంపట్నంలో ఇరుకురోడ్లతో పాటు ట్రాఫిక్ సమస్యలతో పలు ఇబ్బందులకు గురయ్యేవారు. ప్రస్తుతం ఈ రోడ్డు మార్గం పూర్తికావడం వల్ల బీడీఎల్, క్లస్టర్పార్కుతో పాటు ఇతర సంస్థలకు వెళ్లే వాహనాలన్నీ ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి.
ఇబ్రహీంపట్నంకు కొత్తకళ..
ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై నుంచి బైపాస్ రోడ్డుతో పాటు పలు రక్షణ రంగ సంస్థలను కలుపుతూ.. ఇటీవల ఏర్పాటు చేసిన నాలుగు లేన్ల రోడ్డుతో ఇబ్రహీంపట్నం కొత్తకళ సంతరించుకున్నది. ఇబ్రహీంపట్నం ముఖద్వారం వంటి దర్గా వెనుక నుంచి వేసిన ఈ నాలుగు లేన్ల రోడ్డు బైపాస్ రోడ్డు నుంచి వెళ్లే వాహనదారులతో పాటు రక్షణ రంగ సంస్థలకు వెళ్లే వాహనదారులకూ ఎంతో ఉపయోగకరంగా మారింది. దీంతో వాహనదారులు ఈ రోడ్డు మార్గం నుంచే బైపాస్ రోడ్డుకు వెళ్తున్నారు. త్వరలోనే ఈ రోడ్డు మార్గాన్ని అధికారికంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
రోడ్డు నిర్మాణంతో పెరిగిన భూముల ధరలు..
ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై నుంచి బీడీఎల్, క్లస్టర్ పార్కులను కలుపుతూ.. నూతనంగా ఏర్పాటు చేసిన రోడ్డు వల్ల ఈ ప్రాంతంలో భూముల ధరలు మరింత పెరిగాయి. గతంలో బైపాస్ రోడ్డు, చెరువు కట్ట సమీపంలో రూ.కోటికి ఎకరా ఉన్న భూములు ప్రస్తుతం రూ.2కోట్లకు పెరిగింది. సుమారు 3 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు వేయడం వల్ల రోడ్డుకిరువైపులా ఉన్న భూములకు మంచి డిమాండ్ లభించింది. బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న భూములకు కూడా మరింత డిమాండ్ పెరిగింది. మరోవైపు ఈ రోడ్డుకిరువైపులా వెంచర్లను ఏర్పాటు చేయడానికి రియల్ఎస్టేట్ వ్యాపారులు ముందుకొస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన రోడ్డు ఇబ్రహీంపట్నంకు కొత్తకళను తీసుకువచ్చింది.
పారిశ్రామిక ప్రగతిని స్వాగతిస్తున్నాం..
ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి ప్రభుత్వ పరంగా అన్ని వసతులు కల్పిస్తాం. ఇప్పటికే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. ఇప్పటికే బీడీఎల్, ఎన్ఎస్జీ, ఆక్టోపస్, ఎన్పీఏ, వైట్‌గోల్డ్, క్లస్టర్పార్కు ఏర్పాటయ్యాయి. వైట్గోల్డ్లో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున ముందుకు రావడం శుభసూచికం.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం