రంగారెడ్డి, మే 31 (నమస్తే తెలంగాణ): విద్యా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నది. మన ఊరు-మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల రూపురేఖలు మార్చాలని సంకల్పించింది. మొదటి విడుతలో 464 స్కూళ్లు ఎంపిక కాగా, 247 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ నెల 13వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా తొలి విడుతలో ఎంపికైన వాటిలో 25 శాతానికిపైగా స్కూళ్లలో పనులు పూర్తి చేసేలా రంగారెడ్డి జిల్లా యంత్రాంగం చర్యలను ముమ్మరం చేసింది. మండలానికి 4 స్కూళ్ల చొప్పున 126 స్కూళ్లలో పనులను శరవేగంగా జిల్లా విద్యాశాఖ పూర్తి చేయనున్నది. ఇందుకు మంగళవారం రూ.1.30 కోట్లను విడుదల చేసింది.
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొదటి విడుతలో ఎంపికైన పలు ప్రభుత్వ బడుల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. రానున్న మూండేండ్ల కాలంలో రాష్ట్రంలోని అన్ని సర్కారు బడులను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం అధికంగా నిధులను కేటాయిస్తున్నది. అయితే రంగారెడ్డి జిల్లాలో 1,338 ప్రభుత్వ పాఠశాలలుండగా వీటిలో మొదటి విడుతలో 464 ప్రభుత్వ బడు ల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడుతలో ఎంపిక చేసిన బడుల్లో పాఠశాలలు పునఃప్రారంభం లోపే 25 శాతానికి పైగా బడుల్లో అవసరమైన వసతులను కల్పించేందు కు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా 464 పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు ఎంపిక చేయగా, ఇప్పటివరకు 445 స్కూళ్లకు సంబంధించి అంచనాలను అధికారులు పూర్తి చేశారు.
పనుల పూర్తికి అధికారుల చర్యలు
‘మన ఊరు-మన బడి’లో భాగంగా జిల్లాలోని మండలానికి నాలుగు బడుల చొప్పున 126 పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులను బడుల పునః ప్రారంభంలోపు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే 126 బడుల్లో పనులను త్వరగా పూర్తి చేసేందుకు పాఠశాలల వారీగా వేసిన అంచనాల ప్రకారం మంగళవారం రూ.1.30 కోట్ల నిధులను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. అంతేకాకుండా అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివర కు 398 స్కూళ్లకు సంబంధించి పరిపాలన అనుమతులు కూడా మంజూరయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 1,338 స్కూళ్లుండగా తొలి విడుతలో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం 464 స్కూళ్లను ఎంపిక చేసింది. అందులో ప్రాథమిక పాఠశాలలు-261, ప్రాథమికోన్నత పాఠశాలలు-58, ఉన్నత పాఠశాలలు- 145 ఉన్నా యి.
మొదటి విడుతలో ఎంపిక చేసిన బడుల్లో 247 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు అంచనాలు పూర్తైన 445 పాఠశాలల్లో 1,712 పనులను చేపట్టేందుకు రూ. 97.97 కోట్ల నిధులు అవసరమని అధికారులు ప్రణాళికను రూపొందించారు. అంతేకాకుండా పనులు వేగవంతంగా జరిగేలా జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి, కలెక్టర్ అమయ్‌కుమార్ ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన శివరాంపల్లి, జిల్లెలగూడ ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’ లో భాగంగా చేపట్టిన మౌలిక వసతులను కల్పిం చే పనులు 95 శాతానికి పైగా పూర్తికాగా, వారం రోజుల్లో వంద శాతం పనులను పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
‘మన ఊరు-మన బడి’లో భాగంగా 12 అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనాలను రూపొందించారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్, గ్రీన్ చాక్‌బోర్డులు, పెయింటింగ్, ప్రహారీలు, కిచెన్ షెడ్ల నిర్మాణం, శిథిలమైన తరగతి గదుల స్థానంలో కొత్తవి ఏర్పాటు, మరమ్మతు లు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లు వంటి పనులను ప్రభుత్వ పాఠశాలల్లో చేస్తున్నారు.
126 బడుల్లో పనుల పూర్తికి చర్యలు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించే పనులు శరవేగంగా సాగుతున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభంలోపు జిల్లాలోని 126 బడు ల్లో అవసరమైన వసతులను కల్పించే పనుల పూర్తికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు అవసరమైన నిధులను కూడా విడుదల చేశాం. అదేవిధంగా పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన పాఠశాలల్లోనూ ఇప్పటికే 95శాతం పనులు పూర్తికాగా, వారం రోజుల్లో మిగిలిన పనుల పూర్తికి చర్యలు తీసుకుంటున్నాం.
– సుశీంద్రరావు, డీఈవో