రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, నవంబర్ 22: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ మేరకు సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి.అమయ్‌కుమార్‌కు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు నామినేషన్ పత్రాలను అందజేశారు. పట్నం మహేందర్‌రెడ్డి రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేయగా, శంభీపూర్ రాజు నేడు మరో సెట్ నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. మహేందర్‌రెడ్డి తరఫున తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ ఫాతిమా సుల్తానా రెండో సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. మహేందర్‌రెడ్డికి మద్దతుగా మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, ఆనంద్ నామినేషన్ దాఖలు ప్రక్రియలో ఉండగా, శంభీపూర్ రాజుకు మద్దతుగా మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, యాదయ్య, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ మల్లేశం మద్దతుగా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారంతో నామినేషన్ల గడువు ముగియనుండడంతో ప్రతిపక్ష పార్టీలు పోటీ చేస్తారా లేదనేది ఇంకా సందిగ్ధంగా ఉన్నది.
నామినేషన్లకు నేడే ఆఖరు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మంగళవారంతో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనున్నది. ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు రెండు స్థానాలకు నామినేషన్లను దాఖలు చేశారు. మంగళవారం మరో సెట్ నామినేషన్‌ను టీఆర్ఎస్ అభ్యర్థి శంభీపూర్ రాజు దాఖలు చేయనున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. ఆ ఎన్నికల్లో పోటీ చేయాలా.. వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాయి. మెజార్టీ స్థానిక సంస్థల ఓటర్లంతా టీఆర్ఎస్ పార్టీవారే ఉండడంతో పోటీ చేసినా నామమాత్రమేనని తెలుసుకున్న ప్రతిపక్ష పార్టీలు పోటీకి దూరంగా ఉండేందుకు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఓటర్లుండగా, బీజేపీకి మాత్రం కార్పొరేషన్లలో కేవలం 10-15 మంది ఓటర్లున్నారు. మరి ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపుతాయా లేదనేది మంగళవారం తేలనున్నది. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన.. 26 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువు ఇచ్చింది. డిసెంబర్ 10న రెండు స్థానాలకు పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడించనున్నారు.
బీఫామ్‌లను అందజేసిన మంత్రులు
ఉమ్మడి రంగారెడ్డి స్థానిక సంస్థల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్సీలనే అధికార పార్టీ టీఆర్ఎస్ మరోసారి బరిలోకి దింపింది. జనవరి 4తో ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న వీరి పదవీ కాలం ముగియనుండడంతో మరోసారి అభ్యర్థులుగా పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజునే ఖరారు చేసింది. శంభీపూర్ రాజుకు మంత్రి సబితారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రి మల్లారెడ్డి పార్టీ బీఫామ్‌లను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, వివేకానంద, యాదయ్య, సుధీర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, ఆనంద్, ఎమ్మెల్సీలు నవీన్‌రావు, జనార్దన్‌రెడ్డి, మల్లేశం, వాణీదేవి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
మెజార్టీ ఓటర్లు టీఆర్‌ఎస్‌వారే..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మెజార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులంతా టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ఓటర్లు 1179 మంది ఉండగా, వీరిలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. పురుషులు-552, 627 మంది మహిళలున్నారు. వీరిలో కార్పొరేటర్లు-310, కౌన్సిలర్లు-432, జడ్పీటీసీలు-33, ఎంపీటీసీలు-384, ఎక్స్ అఫీషియో సభ్యులు-20 మంది ఉన్నారు. వీరిలో టీఆర్ఎస్కు చెందిన ఎక్స్అఫీషియో సభ్యులు-19, జడ్పీటీసీలు-27, ఎంపీటీసీల్లో రంగారెడ్డి జిల్లాలో 79, వికారాబాద్ జిల్లాలో 151, కౌన్సిలర్లలో వికారాబాద్ జిల్లాలో 57, రంగారెడ్డి జిల్లాలో 42 మంది ఓటర్లున్నారు. మేడ్చల్ జిల్లాలోనూ మెజార్టీ ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఉన్నారు.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు – అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డి
నాపై నమ్మకంతో మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశమిచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. స్థానిక సంస్థల బలోపేతానికి టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా కృషి చేస్తున్నది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను కూడా పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం.