పరిగి, మే 29: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు వారికి అనువుగా బస్సు సర్వీసులు నడిపించడం ద్వారా ఆర్టీసీ పట్ల ప్రజల్లో రోజురోజుకూ మరింత ఆదరణ పెరుగుతున్నది. పట్టణాల కంటే వికారాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలవాసులే ఆర్టీసీ సేవలను ఎక్కువగా సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) కూడా పెరుగుతున్నది. జిల్లాలో మూడు డిపో లు పరిగి, తాండూరు, వికారాబాద్లో ఉన్నాయి. వీటిలో 238 బస్సులు ఉండగా గత నెల రోజులుగా ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం గమనార్హం.
ఓఆర్లో టాప్.. పరిగి డిపో..
జిల్లాలోని మూడు డిపోల్లో ఆక్యుపెన్సీ రేషియోలో పరిగి డిపో మొదటి స్థానంలో నిలిచింది. పరిగి డిపో లో 74 బస్సు సర్వీసులు ఉండగా ఏప్రిల్లో ఓఆర్ -75శాతం ఉండగా మే నెలలో 77 శాతానికి చేరింది. తాండూరు డిపోలో 90 బస్సులుండగా ఏప్రిల్లో ఓఆర్-71శాతం ఉండగా మేలో 76శాతానికి.. అదేవిధంగా వికారాబాద్ డిపోలో 74 బస్సులుండగా ఏప్రిల్లో 69శాతంగా ఉన్న ఓఆర్ మే నెలలో 75 శాతానికి చేరింది. నెల రోజుల వ్యవధిలోనే ఓఆర్ 2 నుంచి 5 శాతానికి పెరిగింది. జిల్లాలోని మూడు డిపోల్లోని బస్సులు ప్రతిరోజూ దాదాపుగా 30 వేల పైచిలుకు మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. తద్వారా పరిగి డిపో రోజుకు సుమా రు రూ.10.5 లక్షలు, తాండూరు డిపో రూ. 10లక్ష లు, వికారాబాద్ డిపో రూ.8లక్షలు ఆదాయాన్ని పొందుతున్నాయి.
ప్రత్యేక చర్యలతో..
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచనలను పాటిస్తూ సంస్థ ఆదాయాన్ని పెంచేందుకు ఉద్యోగులు కృషి చేస్తున్నా రు. ప్రధానంగా ప్రస్తుత పెండ్లిండ్ల సీజన్లో వివాహాలకు ప్రత్యేక బస్సులను నడిపిస్తుండటంలో సంస్థ ఆదాయం పెరుగుతున్నది. అలాగే నిత్యం రద్దీగా ఉం డే రూట్లను ఎంపిక చేసి బస్సులను నడిపిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. సౌకర్యవంతమని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి స్టేజీ వద్ద బస్సులను నిలిపి ప్రయాణికులను పిలిచి మరీ ఎక్కించుకోవడం ద్వారా ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడం తగ్గుతున్నది. అంతేకాకుండా ఆయా రూట్లలోని ప్రయాణికుల సౌకర్యార్థం రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా టెంట్లు వేయించి, కొన్ని చోట్ల తాగునీటి వసతిని కూడా ఆర్టీసీ అధికారులు కల్పిస్తున్నారు. కొన్ని రూట్లలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రయాణికులకు బస్సుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియో 75 శాతం ఉండేలా చూడాలని సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశాలు, ఆయన చేసిన దిశానిర్దేశం మేరకు అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని మూడు డిపోల్లో ఓఆర్ 75 శాతాన్ని దాటింది.
త్వరలోనే కొత్త బస్సులు..
ఆర్టీసీ సంస్థ త్వరలోనే కొత్త బస్సులను కొనుగోలు చేయనున్న నేపథ్యంలో డివిజన్ పరిధిలోని డిపోలకు కూడా కొత్త బస్సులు రానున్నాయి. ఇటీవల పరిగి డిపోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సందర్శించిన సమయంలో ఏ డిపోకు ఎన్ని బస్సులు అవసరమనేది ఆయన అడిగి తెలుసుకున్నారు. పరిగి డిపోలో ఎక్స్ప్రెస్ బస్సులకు మంచి డిమాండ్ ఉండటంతో కొత్త బస్సులను ఇవ్వడంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులు తెప్పించి పరిగి డిపోకు కేటాయించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. తద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య మరింత పెరుగనున్నది.
మూడు డిపోల్లో పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో
సంస్థ ఎండీ సజ్జనార్ సూచనలను పాటిస్తు న్నాం. డివిజన్ పరిధిలోని మూడు డిపోలకు చెందిన బస్సుల్లో ప్రయాణించే వా రి సంఖ్య గణనీయంగా పెరిగింది. నెల రోజుల వ్యవధిలోనే డివిజన్ పరిధిలోని మూడు డిపోల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగి ఆక్యుపెన్సీ రేషియో 75 శాతాన్ని దాటింది. తద్వారా సంస్థకు ప్రతిరోజూ ఆదాయం కూడా పెరుగుతున్నది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా, సమయానికి బస్సులను నడి పి ఓఆర్ శాతాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. -జ్యోతి, డివిజినల్ మేనేజర్, టీఎస్ ఆర్టీసీ