యాచారం, మే 29 : మండల కేంద్రంలోని సర్కారు దవాఖానకు మళ్లీ మంచి రోజులు రానున్నాయా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ప్రస్తుతం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న దవాఖానను రాష్ట్ర ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రిగా మార్చనుంది. ప్రభుత్వ సహకారంతో, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కృషితో యాచారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి రాష్ట్ర వైద్య విధాన పరిషత్ పరిధిలోకి మార్చబడింది. దీంతో మండలంలోని సర్కారు దవాఖాన రూపురేఖలు మారనున్నాయి. దవాఖాన అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందనున్నది. ఇకపై కార్పొరేట్ దవాఖానల స్థాయిలో గ్రామీణ ప్రాంత పేదలకు 24 గంటల మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయంతో ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
మండల కేంద్రంలో ఒకప్పుడు విశాలమైన భవనం, 30 పడకల దవాఖాన, 24 గంటల వైద్య సేవలు, అన్ని విభాగాల వైద్య నిపుణులు, సకల సౌకర్యాలతో విరాజిల్లిన సర్కారు దవాఖాన పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించింది. అనంతరం దవాఖాన స్థాయిని ఉన్నతస్థాయి నుంచి ప్రాథమికస్థాయికి తగ్గించడంతో కొన్ని సంవత్సరాలుగా సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవడం, సౌకర్యాలు సక్రమంగా లేకపోవడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందకుండా పోతున్నాయి. ప్రజలకు ఎంతో ఆదరణ ఉన్న యాచారం ప్రభుత్వ దవాఖాన పనితీరును, ప్రజల అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో తిరిగి ప్రాథమికస్థాయి నుంచి ఉన్నతస్థాయికి పెంచుతూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ దవాఖానకు మళ్లీ పూర్వ వైభవం రానుంది. 35 ఏండ్లుగా పేదలకు వైద్య సేవలను అందిస్తున్న యాచారం దవాఖాన స్థాయిని తిరిగి పెంచడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కలెక్టర్ అమయ్‌కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ భవనాన్ని పరిశీలించారు. దవాఖానను 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ శనివారం దవాఖానను సందర్శించిన విషయం తెలిసిందే.
నేడు రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ పరిధిలోకి..
ప్రభుత్వ దవాఖానను ప్రాథమికస్థాయి నుంచి తిరిగి ఉన్నతస్థాయికి మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్సీ నంబర్ 7182 ప్రకారం 2021, డిసెంబర్ 30న ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప్రస్తుత్వం యాచారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఇకపై రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ పరిధిలోకి రానుంది. దీంతో దవాఖానకు మళ్లీ పూర్వ వైభవం రానుంది. తిరిగి 24 గంటల వైద్య సేవలు, అన్ని విభాగాలకు చెందిన 10 మందికి పైగా వైద్య నిపుణులు, అధికంగా వైద్య సిబ్బంది, అన్ని రకాల వైద్య సేవలు, వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో జనరల్ ఓపీ గతంలా కాకుండా మరింతగా పెరుగనుంది. ప్రసవాలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, కంటి పరీక్షలు, ఎక్స్‌రే, రక్త, మూత్ర, తెమడ పరీక్షలు, దంత వైద్య, ఆయుర్వేద వైద్య సేవల కోసం, అత్యవసర వైద్య సేవల కోసం ఇకపై ఇతర ప్రాంతాలకు రెఫర్ కాకుండా ఇక్కడే పొందవచ్చును. రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ పరిధిలో పేదలకు అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు అందనుండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డీఎంహెచ్‌వో పరిధిలో ఉన్న వైద్య సిబ్బందిని పూర్తిగా బదిలీ చేసి రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న వైద్య నిపుణులు, సిబ్బందిని ఇక్కడ నియమించి గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు మరింతగా మెరుగైన వైద్యం అందించనుంది. సకల హంగులతో కూడిన నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
వైద్య సేవలను మరింతగా విస్తరిస్తాం
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం
రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ద్వారా ప్రభుత్వ దవాఖాన సేవలను మరింతగా విస్తరింపజేస్తాం. దవాఖాన స్థాయి పెరుగడంతో పేదలకు ఇక నుంచి మెరుగైన వైద్యం అందుతుంది. పేదల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు, మండలస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నియోజకవర్గస్థాయిలో మోడల్ పీహెచ్‌సీలను ఏర్పాటు చేసి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నది. గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం పౌష్టికాహారం, కేసీఆర్ కిట్టు, 102 అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచుతుంది. యాచారం దవాఖాన భవన నిర్మాణానికి నా వంతు కృషి చేస్తా.
దవాఖాన స్థాయి పెంచడం సంతోషంగా ఉంది
– చిన్నోళ్ల జంగమ్మ, జడ్పీటీసీ, యాచారం
యాచారం ప్రభుత్వ దవాఖాన స్థాయి పెంచడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తిరిగి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి రాష్ట్ర వైద్య విధాన పరిషత్ పరిధిలోకి మార్చడంతో మళ్లీ పూర్వ వైభవం రానుంది. గతంలో మాదిరి గ్రామీణ ప్రాంత పేదలకు మెరుగైన వైద్యం అందనుంది. ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. నూతన భవనాన్ని అన్ని వసతులతో నిర్మించాలి.