ఇబ్రహీంపట్నం, నవంబర్19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలతో రంగారెడ్డి జిల్లాలో అడవుల విస్తీర్ణం పెరిగి కరువు ప్రాంతా లు జలకళను సంతరించుకున్నాయి. ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. గత పదేండ్లుగా జిల్లాలో వర్షాలు ఆశించిన మేర కురువకపోవడంతో అనేక మండలాలు కరువు బారినపడ్డాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భజలాలు అడుగంటాయి. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో అటవీ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో నాటిన మొ క్కలు ఏపుగా పెరిగి అడవులను తలపిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురిశాయి. జిల్లాలో 29,282 హెక్టార్లలో సుమా రు 70 వేల పైచిలుకు ఎకరాల్లో అటవీ భూములున్నాయి. ఈ భూముల్లో ఉన్న చెట్లను నరికివేయడంతో అడవులు ఎడారిగా మారాయి. జిల్లా లో 33 శాతం అడవులు ఉండాల్సి ఉండగా, 5 శాతం అటవీ ప్రాంతాల్లోనే చెట్లు ఉండేవి. సీఎం కేసీఆర్ భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడంతో జిల్లాలో అడవులు 7 శాతం వరకు పెరిగాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు శివారులో ఉండటంతో పలు మండలాల్లో రియల్ఎస్టేట్ వ్యాపారం పెరిగి చెట్లు కనిపించకుండాపోయాయి. జిల్లాలో వచ్చే ఏడాది నాటికి అడవుల శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. అలాగే జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో చెట్లు నరికివేతకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చెట్లు నరికిన వారిపై జరిమానాలు కూడా విధిస్తున్నారు.
భూగర్భ జలాల వృద్ధి
నియోజకవర్గంలో అడుగంటిన భూగర్భజలాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గణనీయంగా పెరిగాయి. నియోజకవర్గంలోని సుమారు 500 చిన్న, పెద్ద చెరువులు ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా నిండిపోయాయి. దీంతో భూగర్భజలాలు కూడా పెరుగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు నెలల క్రితం ఐదు వందల నుంచి వెయ్యి ఫీట్ల లోతు వరకు బోర్లు వేసినా నియోజకవర్గంలో నీళ్లు వచ్చేవి కావు. నియోజకవర్గంలో గత వర్షాకాలంలో 50వేలకు పై చిలుకు ఎకరాల్లో వరి, ఇతర కూరగాయల పంటలను సాగుచేశారు. ఈ యాసంగిలో ఈ సాగు మరింత పెరిగే అవకాశముంది.
చెరువులకు జలకళ
నియోజకవర్గంలో గత పదేండ్లుగా వర్షాలు ఆశించిన స్థాయిలో కురువక చెరువులు, కుంటలు ఎం డిపోయి భూగర్భజలాలు అడుగంటాయి. దీంతో బోరుబావులు కూడా అనేక చోట్ల ఎండిపోయి సా గు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో అడవుల విస్తీర్ణం పెరిగింది. నియోజకవర్గంలో 30 వేల ఎకరాల్లో అటవీ భూములున్నాయి. ఈ భూ ముల్లో చెట్లు పూర్తిగా నరికివేతకు గురయ్యాయి. నియోజకవర్గంలోని గున్గల్, నోముల, జాపాల, రంగాపూర్, ఎలిమినేడు, దండుమైలారం, మన్నె గూడ, రాయపోల్, తాళ్లపల్లిగూడ తదితర గ్రామా ల్లో అధిక సంఖ్యలో అటవీ భూములున్నాయి. ఈ భూముల్లో మొక్కలను నాటడంతో అడవుల విస్తీ ర్ణం మళ్లీ పెరిగింది. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు నియోజకవర్గంలో రికార్డుస్థాయిలో వర్షపా తం నమోదైంది. ఈ వర్షాలతో గత పదేండ్ల క్రితం ఎండిపోయిన ఇబ్రహీంపట్నం పెద్దచెరువు పూర్తిగా నిండింది. అలాగే, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లోని అనేక చిన్న, పెద్ద చెరువులు, కుంటలు నీటితో నిండుకుండలా తలపిస్తున్నాయి.
ఏపుగా పెరిగిన మొక్కలు
భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన హరితహారం కార్యక్రమం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంచి ఫలితాలిచ్చింది. హరితహారంలో భాగంగా అటవీప్రాంతాలతోపాటు ప్రైవేట్ ప్రాంతాల్లోనూ అధిక సంఖ్య లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. నియోజకవర్గంలో ఉన్న 30వేల ఎకరాల అటవీ ప్రాంతంలో ప్రభుత్వం హరితహారం ద్వారా అధిక సంఖ్యలో అటవీ విస్తీర్ణాన్ని పెంచింది. జిల్లాలో 33 శాతం అటవీ సంపద ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 7 శాతంగా ఉంది. దీనిని 33 శాతం పెంచితే వర్షాలు విస్తారంగా కురిసే అవకాశముంది.
-విష్ణువర్ధన్, అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్, ఇబ్రహీంపట్నం