జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాన్ని నేతలు, అధికారులు, యువజన సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కొనియాడారు. ప్రతి ఒక్కరూ మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు, చౌరస్తాలు, వాడవాడలా మువ్వన్నెల జెండాలు ఎగురవేశారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో జెండా పండుగను నిర్వహించారు. ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం చర్లపటేల్‌గూడ సమీపంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. చేవెళ్ల మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంపై ఎమ్మెల్యే కాలె యాదయ్య, చేవెళ్ల దవాఖానలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి జాతీయ జెండాను అవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయం, గ్రంథాలయం, మండల పరిషత్, ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి పాల్గొని జెండాకు వందనం చేశారు. మున్సిపాలిటీ చైర్మన్, చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీడీవోలు, పోలీసు అధికారులు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వారి వారి కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
-న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ