రంగారెడ్డి, మే 11 (నమస్తే తెలంగాణ)/షాద్‌నగర్ : ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. ఏడాదిలోగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి సాగునీరు అందిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం షాద్‌నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు హాజరై మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదని బండి సంజయ్ తొండి మాటలు మాట్లాడుతున్నాడని, ఒకసారి ఉద్దండాపూర్ వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను చూడాలని సూచించారు.
మరో ఏడాది లోగా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ద్వారా సాగు నీరు అందనుందన్నారు. షాద్‌నగర్‌లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. షాద్‌నగర్ పట్టణంలో రూ.21 కోట్లతో వందపడకల దవాఖాన నిర్మిస్తున్నామని, ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి మరో ఏడాదిలోగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. స్థానికంగా ఇప్పటికే డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. అదేవిధంగా మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రూ.4 కోట్ల నిధులతో 20 సబ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఏడాదిలోగా పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. బుధవారం షాద్‌నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో పర్యటించిన మంత్రి షాద్‌నగర్ పట్టణంలో 100 పడకల దవాఖాన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. జిల్లాలో పాదయాత్ర చేసిన బండి సంజయ్ పాలమూరు ప్రాజెక్టు ముందుకు సాగలేదని.. తొండి మాటలు మాట్లాడారని, ఉదాండపూర్ వద్ద కొనసాగుతున్న పనులను చూడాలని సలహా ఇచ్చారు. మరో ఏడాది లోగా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ద్వారా కూడా సాగు నీరు అందించేందుకు శరవేగంగా పనులను పూర్తిచేస్తామని చెప్పారు.
ప్రాజెక్టుల నిర్మాణాలకు సహకరించకపోవడంతో పాటు పైగా కేసులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అర్థం లేని మాటలు చెపుతున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తమ రాష్ర్టాల్లో అమలవుతున్న పథకాలు ఏమున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో తెలంగాణ కాకుండా ఏ రాష్ట్రమైనా 24 గంటల విద్యుత్ ఇస్తున్నదా? ఆసరా పింఛన్లు ఇస్తున్నారా? రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కేవలం కుర్చీల కోసం మాటలు చెప్పడం తప్పా , తెలంగాణ ప్రజల కోసం ఏం చేస్తారో చెప్పే స్థితిలో రెండు పార్టీలు లేవని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పిన మోదీ ఏడేండ్లు గడుస్తున్నా ప్రాజెక్టుకు ఒక్క పైసా ఇవ్వలేదని దుయ్యబట్టారు.
సీఎం కేసీఆర్ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రైతులకు అన్యాయం జరుగనివ్వరని, ఎట్టి పరిస్థితిల్లోనూ తెలంగాణ బోరుబావులకు మీటర్ల బిగింపు ఉండదని తెగేసి చెప్పారు. షాద్‌నగర్ పట్టణంలో రూ. 21కోట్ల నిధులతో 100 పడకల దవాఖానను మరో ఏడాది లోపు నిర్మించి, అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ప్రస్తుతమున్న దవాఖానను మాతా శిశు సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని వివరించారు. షాద్‌నగర్ ప్రాంతంలో స్థానికంగా ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. షాద్‌నగర్ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రూ.4 కోట్ల నిధులతో 20 సబ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామంలో మంత్రి సబితారెడ్డితో కలిసి నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. అల్వాల, కొత్తపేట, ఇప్పలపల్లి గ్రామాల్లో రైతు వేదికల భవనాలను ప్రారంభించారు. కేశంపేటలో రూ.75 లక్షల నిధులతో నిర్మిస్తున్న 30 పడకల సర్కారు దవాఖాన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, మాజీ ఎమ్మెల్యే బీష్వ కిష్టయ్య, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీలు వెంకట్రాంరెడ్డి, తాండ్ర విశాల, శ్రీలత, ఎంపీపీలు ఖాజా ఇద్రీస్, రవీందర్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నె కవిత, నాయకులు వంకాయల నారాయణరెడ్డి, రామకృష్ణారెడ్డి, అగ్గనూరు విశ్వం, దేవేందర్‌యాదవ్, వెంకట్‌రెడ్డి, లక్ష్మణ్‌నాయక్, రాంబల్‌నాయక్, ఎండీ ఫరీద్, పినమోని గోపాల్, జమృత్‌ఖాన్, లక్ష్మీనారాయణ, మురళీధర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వేణుగోపాల్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉద్దెర మాటలు తప్పా.. పాలనపై సోయి లేదు
ఉద్దెర మాటలు చెప్పడం తప్పా రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలో తోచని స్థితిలో బీజేపీ నాయకులు ఉన్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మండిపడ్డారు. షాద్‌నగర్ నియోజకర్గంలో 7 గురుకుల పాఠశాలలు, డిగ్రీ గురుకుల కళాశాలను ఏర్పాటుచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. ప్రతి యేట ఒక్కో విద్యార్థికి రూ.1.20 లక్షలు ఖర్చుచేస్తున్నదన్నారు. ఉద్యోగాలు లేవని చెప్పే బీజేపీ నాయకులకు తమ పాలనలో అన్ని సంస్థలను అమ్ముకుంటే ఉద్యోగాలు ఎక్కడ కనబడుతాయని ఎద్దేవా చేశారు.
మిషన్ కాకతీయతో చెరువులు నిండితే, మిషన్ భగీరథతో గ్రామాలకు మంచినీళ్లు వచ్చాయని చెప్పారు. గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలు, శ్మశానవాటికల నిర్మాణాల పైసలు మావే అని బీజేపీ బండి సంజయ్ మాట్లాడడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పనులు జరుగలేదని చెప్పడం కాదు, ఒక్కసారి ఉదండాపూర్ వెళ్లి చూడాలని సూచించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చాడో బీజేపీ నాయకులు చెప్పాలని చురకలంటించారు.
70 ఏండ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలి
70 ఏండ్ల దేశ పాలనలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజల సంక్షేమానికి ఏం చేశాయో చెప్పాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. 8 ఏండ్ల తెలంగాణ పనితీరును తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారని, అదే 70 ఏండ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఏమి చేశారో ప్రజలకు తెలుసన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్యం, విద్యా శాఖలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, సీఎం పాలనలో ఈ రెండు శాఖలను ఎంత బలంగా చేశారు ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని చెప్పారు. ఒక్కసారి చాన్స్ ఇవ్వండి అని కాంగ్రెస్ నాయకుడు రాహూల్ గాంధీ అడుగుతుంటే ఏమనాలో తెలియని పరిస్థితి ప్రజల్లో ఉందన్నారు. 50 ఏండ్ల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ చాన్స్ అడుగడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల సమయంలో హిందు, ముస్లింల మధ్య మత చిచ్చు పెట్టి దేవుడి పేరుతో ఓట్లను వేయించుకునే బీజేపీని కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు.
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు
షాద్‌నగర్ నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రామేశ్వరం సర్పంచ్ సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, షాద్‌నగర్ పట్టణానికి చెందిన దిలీప్‌కుమార్, పలువురు యువకులు టీఆర్ఎస్లో చేరారు. నాయకులకు మంత్రి పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు.
జేపీ దర్గాను దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు
కొత్తూరు రూరల్, మే 11 : కొత్తూరు మండలపరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామంలో గల హజ్రత్ సయ్యద్ జహంగీర్‌పీర్ దర్గాను మంత్రి హరీశ్‌రావు, మంత్రి సబితారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొత్తూరులోని నాట్కో చౌరస్తా వద్దకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకుని మంత్రి హరీశ్‌రావుకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి స్వాగతం పలికారు. దర్గాలో మంత్రి హరీశ్‌రావు దట్టి, పూలచాదర్‌ను తలపై పెట్టుకుని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి బాబాలకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దర్గా ముజావర్ల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ప్రార్థనల అనంతరం కేశంపేటకు వాహనాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరారు.