కేశంపేట, మే 11 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది. కేశంపేట మండలంలోని కేశంపేట, కొత్తపేట, సంతాపూర్, కోనాయపల్లి గ్రామాల్లో బుధవారం రెండో రోజు సాగిన పాదయాత్రలో బండి వెంట ప్రజలు లేక పేలవంగా మారింది. యాత్రలో సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలపై అడ్డగోలు విమర్శలు చేశారు. బీజేపీకి కూడా ప్రజలు ఒకసారి అధికారాన్ని కట్టబెట్టాలని బండి బతిమిలాడారు. దేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై పెనుభారాన్ని కేంద్ర ప్రభుత్వం మోపిందని కొత్తపేటలో మహిళలు బండిని నిలదీశారు. కేంద్రం రాష్ర్టానికి అభివృద్ధి పనుల కోసం నిధులిస్తున్నదని చెబుతూ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ప్రజలకు సరైన సమాధానం ఇవ్వకుండా టాపిక్‌ను మళ్లించారు.
దిగుమతి శ్రేణులే దిక్కు..
పాదయాత్ర సాగిన గ్రామాల్లో ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో బండి సంజయ్ వెంట ఉన్న బయటి ప్రాంతాల బీజేపీ శ్రేణులే దిక్కయ్యారు. యాత్రలో జనం లేకపోవడంతో పక్క గ్రామాల నుంచి రోజు కూలీ రూ.300 నుంచి 500 ఇచ్చి తీసుకువచ్చారు. స్థానిక నాయకులు, కార్యకర్తలకు సరైన గుర్తింపు లభించకపోవడంతో కొంత అసహనం, నిరాశకు లోనయ్యారు.
డీజేలతో హంగామా
మొదటి రోజు సాయంత్రం కేశంపేటకు చేరుకున్న పాదయాత్రలో బయటి ప్రాంతాల బీజేపీ, బీజేవైఎం శ్రేణులు కాగడాలు, విద్యుత్ దీపాల గొడుగుల ప్రదర్శనలో డీజేల హంగామా ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. ఈ ప్రదర్శనతో ట్రాఫిక్ జామై ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వారు ఎంత హంగామా సృష్టించినా.. స్పందన మాత్రం కరువైంది.