రంగారెడ్డి, మే 9, (నమస్తే తెలంగాణ): 2022 వానకాలం పంటల సాగుకు యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాదికి సంబంధించి 4.88 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. పత్తితోపాటు కంది పంటల సాగు కూడా పెరుగుతుందని జిల్లా వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అత్యధికంగా పత్తి పంట సాగును గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లక్షా40 వేల ఎకరాల వరకు పెంచుతూ నిర్ణయించారు. మరోవైపు ఆయా పంటల సాగుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలకు సంబంధించి ఎంత మేర అవసరమనేది ఇప్పటికే అంచనా వేసిన అధికారులు ఈ నెలాఖరులోగా జిల్లాకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు.
వానకాలంలో 4,88,597 ఎకరాల్లో సాగు
ఈ ఏడాది వానకాలం సీజన్లో 4,88,597 ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికను రూపొందించారు. పత్తి 2,75,050 ఎకరాలు, కందులు 70,520, వరి 75వేలు, జొన్న 15వేలు, మొక్కజొన్న 48వేలు, పెసర 352, మినుములు 170, వేరుశనగ 240, ఆముదం 120, సోయాబీన్ 20, ఇతర పంటలు 4125 ఎకరాల్లో వానకాలంలో సాగవుతుందని అంచనా వేశారు. గతేడాది వానకాలంలో 3,79,675 ఎకరాల్లో సాగుకాగా, ఈ ఏడాది 1,08,922 ఎకరాల్లో ఆయా పంటల సాగును పెంచుతూ నిర్ణయించారు. గతేడాదితో పోలిస్తే వరి సాగును సుమారు 60 వేల ఎకరాలకు తగ్గించాలని, జొన్నకు సంబంధించి గతంతో పోలిస్తే ఈ ఏడాది 10 వేల ఎకరాల వరకు పెంచాలనుకుంటున్నారు. ఆయా పంటలకు సంబంధించి 26,702 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. అవసరమైన విత్తనాల్లో పత్తి 5,50,100 ప్యాకెట్లు, వరి 18,750 క్వింటాళ్లు, జొన్న 600, మొక్కజొన్న 3840, పెసర 28, కందులు 2820, మినుములు 13.6, వేరుశనగ 144, ఆముదం 3, సోయాబీన్ 7, ఇతర పంటలకు సంబంధించి 495 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు నిర్ణయించారు.
1,43,450 ఎకరాలకు పెరిగిన పత్తి
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పత్తి సాగును 1,43,450 ఎకరాల మేర పెంచాలని నిర్దేశించారు. గతేడాది జిల్లాలో 1.31 లక్షల ఎకరాల్లో సాగుకాగా, ఈ ఏడాది 2.75 లక్షల ఎకరాలకు పెంచారు. కంది పంటను గతేడాదితో పోలిస్తే 35 వేల ఎకరాల వరకు పెంచాలని నిర్ణయించారు. గతేడాది 35,576 ఎకరాల్లో కంది పంట సాగుకాగా, ఈ ఏడాది 70,520 ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు.
5.96లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం
పరిగి, మే 9 : వికారాబాద్ జిల్లాలో వానకాలంలో పంటల సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈసారి 5,96,900 ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత పంటల సాగు పెంచితే చివరకు 6.10లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఇందుకనుగుణంగా ఎరువులు సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.
వానకాలంలో సాగు చేసే పంటల వివరాలు
వికారాబాద్ జిల్లాలో ఈసారి 1,91,283 ఎకరాల్లో పత్తి, 1,77,000 ఎకరాల్లో కందులు, మొక్కజొన్న 69,680, జొన్న 2,504, వరి 1,12,537, పెసర 15,316, మినుములు 9,305 ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయాధికారులు ఆయా మండలాలవారీగా సేకరించిన వివరాల ప్రకారం అంచనాలు తయారు చేశారు. ఈసారి జిల్లా పరిధిలో పత్తి సాగును 1.91లక్షల నుంచి 2.70లక్షల ఎకరాలకు పెంచడానికి కృషి జరుగుతున్నది. కందులు అదనంగా మరో 30వేల ఎకరాల్లో సాగు చేయాలని నిర్దేశించారు.
ఎరువులు, విత్తనాలు సిద్ధం
పత్తి సాగుకు 3,82,565 విత్తనాల ప్యాకెట్లు, మొక్కజొన్న 3,484 క్వింటాళ్లు, జొన్న 130, కంది 7,080, వరి 28,135, మినుములు 375, పెసర 612 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు అంచనాలు తయారు చేశారు. ఈ విత్తనాలను సంబంధిత డీలర్లు ముందుగానే అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు చేపట్టారు. వర్షాలు కురిసే సమయానికి ఆయా ప్రాంతాల్లో రైతులు కొనుగోలు చేసేందుకు వీలుగా విత్తనాలను సిద్ధంగా ఉంచాలని అధికారులు సూచించారు.
దీంతోపాటు వానకాలంలో 74,547 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనాలు తయారు చేశారు. యూరియా 31,902 మెట్రిక్ టన్నులు, డీఏపీ 11,884, ఎంవోపీ 5,969, కాంప్లెక్స్ ఎరువులు 17,901, ఎస్ఎస్పీ 6,891 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని గుర్తించారు.ఎరువుల కొరత తలెత్తకుండా బఫర్ స్టాకులు ఏర్పాటు చేయించేందుకు అధికారులు నిర్ణయించారు. జిల్లాలో అత్యధికంగా ఎరువులు అవసరమైన ప్రాంతాల్లో బఫర్ స్టాకులు ఏర్పాటు చేయనున్నారు.
పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం
నెలాఖరులోగా విత్తనాలు, ఎరువులు:గీతారెడ్డి, రంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి
వానకాలం సీజన్లో ఆయా పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ఈ నెలాఖరులోగా అందుబాటులో ఉంచుతాం. ఇప్పటికే జిల్లాకు ఎంతమేర విత్తనాలు, ఎరువులు అవసరమనేది అంచనా వేశాం. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది పత్తి సాగును గణనీయంగా పెంచేలా చర్యలు చేపట్టాం. వారం రోజుల్లో క్షేత్రస్థాయిలో ఏఈవోల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాం.
సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి
వికారాబాద్ జిల్లా పరిధిలో వానకాలంలో పంటల సాగు ప్రణాళిక సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా ఈసారి 5,96,900 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. అందుకనుగుణంగా 74,547 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని గుర్తించాం. ఆయా పంటలకు ఎప్పుడు ఎంత ఎరువు అవసరమవుతుందో ఆ మేరకు ఎరువుల సరఫరా జరుగుతుంది. అవసరమైతే బఫర్ స్టాకులు ఏర్పాటు చేస్తాం. విత్తనాలు సిద్ధంగా ఉంచాలని సూచించాం. జిల్లాలో పత్తి, కందుల సాగు విస్తీర్ణం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.