ధారూరు, మే 9: గ్రామంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని, ఈ ఏడాది పంటలు బాగా పడి దిగుబడులు అధికంగా రావాలని కోరు తూ కెరెళ్లి గ్రామస్తులు గ్రామ దేవతలకు సోమవారం బోనాలను సమర్పించారు. మండలంలోని కెరెళ్లి గ్రామంలో గత మూడు రోజులుగా గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాల్గో రోజు గ్రామంలోని మహిళలు, యువతులు గ్రామదేవతలకు ఘనంగా బోనాలు తీశారు. బోనాలను రంగులతో అలంకరించి ఇంటికో బోనం చొప్పున మహిళలు నెత్తిన ఎత్తుకుని గ్రామంలోని ప్రధాన వీధులగుండా డప్పుచప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలతో ఊరేగింపుగా గ్రామ దేవతలైన మైసమ్మ, పోచమ్మ, గాలి పోచమ్మ తదితర ఆలయాలకు తరలివెళ్లి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్, గోవర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యు లు, గ్రామస్తులు, నాయకులు, గ్రామపెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
ముడిమ్యాల గ్రామంలో..
చేవెళ్లటౌన్, మే 9: మండలంలోని ముడిమ్యాల గ్రా మంలో బొడ్రాయి ప్రతిష్ఠాపనోత్సవంలో భాగంగా సోమవారం గ్రామస్తులు ఇంటికో బోనం తీశారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, యువకుల కేరింతలతో మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి బొడ్రాయికి సమర్పించారు. ఈ సందర్భంగా వర్షాలు కురిసి గ్రామస్తులు సుఖ సంతోషాలతో జీవించాలని బొడ్రాయిని మహిళలు కోరుకున్నారు. బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నా రు. కార్యక్రమంలో ముడిమ్యాల సర్పంచ్ శేరి స్వర్ణలతాదర్శన్, నాయకులు సాయికుమార్, శ్రీధర్‌రెడ్డి, శేరి రాజు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.