బొంరాస్పేట, మే 8 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఆలయాలకు స్వర్ణయుగంగా చెప్పవచ్చు. దీపం వెలిగించే వారులేక చీకట్లో మగ్గిపోయిన వేలాది గుడుల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నిత్యపూజలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ధూపదీప నైవేద్యం పథకంతో అనేక ఆలయాలకు కొత్తశోభ చేకూరింది. పూజలకు నోచుకోని గుళ్లలో నిత్యం పూజలు జరిగేలా, దేవుళ్లకు నైవేద్యం సమర్పించేలా దేవాదాయ ధర్మాదాయ శాఖ 2009లో ధూపదీప నైవేద్యం పథకాన్ని ప్రవేశపెట్టింది. గతంలో భక్తులు ఇచ్చే దక్షిణలతోనే గుళ్లో నిత్యం పూజలు చేసే అర్చకులకు కుటుంబాల పోషణ భారంగా ఉండేది. ఈ పథకం అమలుతో అర్చకులకు ఆర్థిక చేయూతతోపాటు ఆలయాల్లో నిత్యం పూజలు కొనసాగుతున్నాయి. ధూపదీప నైవేద్యం పథకం కింద ఎంపిక చేసిన ఆలయాలకు ప్రభుత్వం పథకం ప్రారంభంలో రూ.2500 చెల్లించేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.6వేలకు పెంచింది. ఇందులో రూ.4వేలు అర్చకుడికి వేతనంగా, రూ.2వేలు ఆలయ నిర్వహణకు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతినెలా 1వ తేదీనే ప్రభుత్వం వీరికి ట్రెజరీ ద్వారా వేతనాలను అర్చకుల ఖాతాల్లో జమ చేస్తున్నది. ఈ పథకం అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా ఆలయాలకు కొత్త శోభ చేకూర్చింది. జిల్లాలో దేవాదాయ, ధర్మాదాయ శాఖలో రిజిష్టర్ అయిన దేవాలయాలు 100 ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2010లో జిల్లాలోని 19 దేవాలయాలను ఈ పథకం కింద ఎంపిక చేయగా, తెలంగాణ వచ్చిన తరువాత 2017లో రెండో విడుతలో మరో 37 దేవాలయాలను ప్రభుత్వం ఎంపిక చేసింది.
మంచి పథకం
ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ధూపదీప నైవేద్య పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం కొనసాగించడం, మరిన్ని దేవాలయాలకు వర్తింపజేయడం సంతోషం. ఈ పథకం అమలుతో దేవాలయాల్లో నిత్యం పూజలు జరుగుతున్నాయి. అర్చకులకు వేతనాలు ఇవ్వడంతో ఆసరాగా ఉంటుంది. పథకాన్ని ఎక్కువ దేవాలయాలకు వర్తింపజేయడంతోపాటు అర్చకులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి.
– లోకుర్తి జయతీర్థాచారి,ధూపదీప నైవేద్య పథకం జిల్లా అధ్యక్షుడు
పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
దీపమే వెలిగించని గుళ్లకు ధూపదీప నైవేద్యం మంచి పథకం. ఈ పథకాన్ని మరిన్ని దేవాలయాలకు విస్తరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీల పరిధిలోని దేవాలయాలకు ఈ పథకం వర్తించేది కాదు. కానీ ఈసారి ప్రభుత్వం వీటి పరిధిలోని దేవాలయాలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మే నెల 20 వరకు గడువు ఉన్నది. దేవాదాయ శాఖలో పబ్లికేషన్/రిజిష్టర్ అయిన దేవాలయాల అర్చకులు దరఖాస్తు చేసుకోవాలి.
– నాగరాజు, దేవాదాయ శాఖ ,సహాయ కమిషనర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా