పెద్దఅంబర్‌పేట, మే 7: రంగారెడ్డి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటకముందే భానుడు భగ్గుమంటున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రోహిణి కార్తె ప్రవేశిస్తే రోళ్లు పగులుతాయేమోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఐదు నిమిషాలు ఎం డకెళ్లొస్తే గొంతు ఎండుకుపోతున్నది. పది నిమిషాలకోసారి పెదవులపై, గొంతులో నీటి తడి పడకపోతే కండ్లు తిరిగేలా భానుడు మండుతున్నాడు. అన్ని వసతులు ఉన్న మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక పక్షులు, ఇతర జీవజాతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం నీరు కూడా లభించక పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఎండల తీవ్రతతోపా టు నీరు దొరుకక చనిపోతున్న పక్షుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని ఇటీవల ఓ సర్వే చెప్పిన విషయాలు బాధను కలిగిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కొందరు పక్షి ప్రేమికులు వాటికోసం ప్రత్యేకంగా నీటి వసతి కల్పిస్తున్నారు. మట్టి, ఇతర పాత్ర ల్లో వాటి కోసం నీటిని పోస్తున్నారు. దాణా కూడా వేస్తున్నారు. పక్షులనే ప్రేమించక పోతే ఇంకా ప్రేమను ఎలా పంచుతామని ప్రశ్నిస్తున్నారు. ‘వీలైతే నీళ్లు పోద్దాం.. కుదిరితే దాణా వేద్దాం డూడ్’ అంటూ పిలుపునిస్తున్నారు.
నీటితో పాటు బియ్యం..
పక్షులకు నీళ్లు పోస్తే పుణ్యమే కదా. మా ఇంటి మిద్దెపై ఉన్న బాత్రూంలో పక్షి గూడు కట్టుకున్నది. దాని పక్కనే ప్రతిరోజూ నీటితోపాటు కొన్ని బియ్యం గిం జలను పెడుతున్నా. అక్కడి నీటిని తాగి, గింజలను తిని పక్షులు వెళ్తుంటా యి. మా ఇంట్లోని మరో రెండు బాత్రూంల కిటికీల్లోనూ గూళ్లు పెట్టాయి. వాటికి కూడా ప్రత్యేకంగా నీళ్లు పెడుతున్నా. ఎండలకు మనమే బయటికి వెళ్లలేకపోతున్నాం. అవి ఎండలోనే ఉంటాయి. వాటిది కూడా ప్రాణమే కదా. నా వంతుగా నీటిని పెడుతూ పక్షి ప్రేమను చాటుతున్నా.
– పవన్‌కుమార్, జీవీఆర్కాలనీ, తట్టిఅన్నారం, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ
చిన్న ప్రాణులకు నీటి సాయం
ప్రతిరోజూ గౌరెల్లి పంచాయతీ కార్యాలయం ఎదుట పక్షుల కోసం నీటిని పెడుతున్నా. కార్యాలయ ఆవరణలో, పక్కన భారీ వృక్షాలు ఉన్నాయి. ఆ పక్కనే ఉన్న నర్సరీలో మొక్కలను కూడా పెంచుతున్నాం. చెట్లపైకి చాలా రకాల పక్షు లు వస్తుంటాయి. వాటి కోసం కొంచెం నీడలో ప్రత్యేకంగా నీటి వసతిని ఏర్పా టు చేశా. ఉదయం, సాయంత్రం సమయాల్లో అక్కడికి వచ్చి పక్షులు నీటిని తాగి వెళ్తుంటాయి. చిన్న ప్రాణాల దాహార్తిని తీర్చుతున్నా. నేను లేని సమయంలో పంచాయతీ సిబ్బంది అక్కడ నీళ్లు పెడుతారు.
– తుడుము మల్లేశ్, గౌరెల్లి సర్పంచ్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం
అలవాటుగా మారింది
గతంలో సెలవులు వచ్చినప్పుడు ఉదయం, సాయంత్రం సమయాల్లో పక్షులకు నీటితోపాటు బియ్యం గింజలను వేసేది. అదే అలవాటుగా మారింది. ఇప్పుడు ఎండలు మండుతున్నాయి. పక్షులు నీటిని తాగకపోతే చనిపోయే పరిస్థితులు వచ్చాయి. అందుకే వాటి కోసం నీరుతోపాటు బియ్యం గింజలను ప్రతిరోజూ పెడుతున్నా.
– పీ శ్వేత, తట్టిఅన్నారం
చాలా ఆనందంగా ఉంది
పక్షులకు ప్రతిరోజూ నీరు, దాణా పెట్టడం ఎంతో ఆనందంగా ఉన్నది. అందుకే అపార్టుమెంట్ మా ఫ్లాట్‌కు బయటవైపు ప్రత్యేకంగా దాణా కోసం ఓ బాక్స్‌ను ఏర్పాటు చేశా. అక్కడే నీటిని, దాణాను పెడుతున్నా. అపార్టుమెంట్ వాళ్లంతా కూడా ఇలాగే చేస్తే ఎన్నో పక్షుల ప్రాణాలను కాపాడొచ్చు. ఈ విషయా న్ని చుట్టుపక్కల వారితోనూ ఎప్పుడూ చెప్తుంటా. ప్రతి ఒక్కరూ పక్షుల కోసం కొన్ని నీళ్లు పెట్టాలి.
– ముఖేశ్ నాగర్, ఇందుపల్లవి అపార్టుమెంట్, తట్టిఅన్నారం