ఇబ్రహీంపట్నంరూరల్/ తలకొండపల్లి, మే 4 : ఉరుకులు.. పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడంలేదు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ లేకపోవడంతో చాలామంది అక్కడికక్కడే మృతిచెందిన, గాయాలైన సందర్భాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. అవగాహన లేని వాహనదారుల నిర్లక్ష్యం ధోరణి కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదని రవాణావాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నప్పటికీ గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆతృతతో హెల్మెట్ వాడకాన్ని విస్మరిస్తున్నారు.
హెల్మెట్ వాడకంపై చట్టం..
ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలని మోటారు వాహనాల చట్టం 1998లోని 129, 177సెక్షన్లు చెబుతున్నాయి. దీని ప్రకారంగా ఎవరైనా హెల్మెట్ ధరించకపోతే జరిమానా విధించే అవకాశాలున్నాయి. పదేపదే వాహనదారుడు హెల్మెట్ లేకుండా జరిమానా పడుతుంటే డ్రైవింగ్ లెసెన్స్ శాశ్వతంగా రద్దుచేసే అవకాశముంటుంది.
వాహనదారుల్లో చైతన్యం కోసం..
పోలీసుశాఖ జిల్లాలో అన్ని మండలాల్లో వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై విస్త్రత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తోంది. ప్రదర్శనలు, పలు కూడళ్లలో వాహనదారులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నది. తనిఖీల సమయంలో హెల్మెట్ ధరించడం తప్పనసరి అని ప్రాథమిక అవగాహన వచ్చేందుకు జరిమానాలు విధిస్తూనే వివరాలు నమోదు పక్రియను చేపడుతారు. రెండు మూడు దఫాలుగా సదరు వాహనం, అదే వ్యక్తి నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడితే చర్యలు తీసుకుంటారు.
హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి
ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలి. హెల్మెట్ లేకుండావచ్చే ద్విచక్ర వాహనదారుల వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయటంలేదు. రిజిస్ట్రేషన్ సమయంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నాం. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మోటారు యాక్ట్ చట్టంకింద జరిమానా విధించటంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తాం.
– రఘునందన్గౌడ్, రవాణాశాఖ అధికారి, ఇబ్రహీంపట్నం
ధరిస్తే ముప్పు తప్పుతుంది
హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు పోయే సందర్భాలు చాలా తక్కువ. దీనివల్ల ముప్పు చాలా వరకు తప్పుతుంది. ప్రతిరోజు బైక్ నడిపించే సమయంలో హెల్మెట్ తప్పనిసరి ఉపయోగిస్తా. సాయంత్రం వేళ్లలో వాహనం నడుపుతున్నప్పుడు దుమ్మూ, ధూళీ నుంచి ముఖాన్ని కాపాడుకొవచ్చు.
– రాజేందర్రెడ్డి, జంగారెడ్డిపల్లి గ్రామం
కఠిన చర్యలు తీసుకుంటాం
హెల్మెట్ వినియోగంపై విస్త్రతంగా ప్రచారం నిర్వహించాం. ప్రయోజనాలపై అవగాహన కల్పించా. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదు. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తాం. వాహనదారులు ఇప్పటికైనా స్పందించి హెల్మెట్ వినియోగించాలని కోరుతున్నాం.
– శివశంకర్ వరప్రసాద్, ఎస్సై తలకొండపల్లి