హయత్నగర్రూరల్, మే 4 : ‘హలో.. సర్ ఇది మంచి అవకాశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను ఇప్పుడే చెల్లించండి. రూ.5శాతం రాయితీ పొందండి’ ఓ ఇంటి యజమానికి ఫోన్లో బిల్ కలెక్టర్ విజ్ఞప్తి.‘సర్ ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. ముందస్తు పన్ను చెల్లింపులతో ప్రగతి పనులు కూడా పెరుగుతాయి. సమస్యలకు తావే ఉండదు. అదనంగా మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది’ ఓ ఇంటి యజమానికి నేరుగా వివరిస్తున్న ఓ బిల్ కలెక్టర్. ఎర్లీబర్డ్ స్కీంపై పెద్దఅంబర్‌పేట మున్సిపల్ అధికారుల ప్రచారం సత్ఫలితాలిచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నులు ముందస్తుగా చెల్లించండి, 5 శాతం డిస్కౌంట్ పొందండి అంటూ కల్పించిన విస్తృత అవగాహనతో మున్సిపాలిటీకి కాసులు కురిపించేలా చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా లక్ష్యంలో 38శాతం పన్నులు వసూలయ్యాయని మున్సిపాలిటీ మేనేజర్ కిరణ్‌కుమార్ తెలిపారు.
పథకంపై విస్తృత ప్రచారం
మున్సిపాలిటీలో 9,206 మంది ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. ఏటా రూ.4.38కోట్ల పన్నులు వసూలు చేయాలనేది లక్ష్యం. ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎర్లీబర్డ్ పథకం కింద పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బిల్ కలెక్టర్లకు పన్నుల వసూళ్ల పనినే అప్పగించారు. ఈ పథకంపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అవగాహన కల్పించి చైతన్యపర్చాలని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టే బిల్ కలెక్టర్లు, ఇతర సిబ్బంది పన్ను వసూళ్లపై ప్రచారం చేశారు. ఎక్కువమందికి అవగాహన కల్పించారు. పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించడంలో సఫలీకృతులయ్యారు. ఈ పథకం ద్వారా గత ఏడాది ఎలాంటి పన్ను బకాయిలు లేని యజమానులు.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులు కూడా చెల్లిస్తే ప్రభుత్వం పన్నులో 5 శాతం రాయితీ ఇస్తున్నది. ఏప్రిల్ 30వ తేదీ వరకు మున్సిపాలిటీ పరిధిలో 2,264 మంది ఆస్తి పన్నులను ముందస్తుగా చెల్లించారు. అంటే మొత్తం పన్ను చెల్లింపుదారుల్లో 38 శాతం మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వీరు రూ.1.77 కోట్లు పన్నుల రూపంలో చెల్లించారు. ఈ స్కీం కింద ఇంత పెద్దమొత్తంలో పన్నులు వసూలు కావడం ఇదే ప్రథమం. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని కేవలం 13 శాతం మంది మాత్రమే వినియోగించుకున్నారు. లక్షల్లోనే పన్నులు చెల్లించారు.