రంగారెడ్డి, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : మన ఊరు-మన బడితో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. తొలి విడుతలో ఎంపికైన పాఠశాలల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అధికారులు సమకూర్చుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం విద్యా బోధనను అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 22 కేంద్రాల్లో ఉపాధ్యాయులకు గణితం, సాంఘికశాస్త్రం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులపై ప్రత్యేక శిక్షణను విద్యాశాఖ ఇచ్చింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనూ శిక్షణా కార్యక్రమం కొనసాగుతున్నది. పదో తరగతిలో కార్పొరేట్‌కు దీటుగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇంగ్లిష్, తెలుగు భాషల్లోనూ పాఠ్యాంశాలను బోధించేందుకు పుస్తకాలను ముద్రిస్తున్నది. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన శివరాంపల్లి, జిల్లెలగూడ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులు దాదాపు పూర్తికాగా, ఎంపికైన పాఠశాలల్లో వారం రోజుల్లో వంద శాతం పనులను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడితో ప్రభుత్వ పాఠశాలల దశ మారుతున్నది. ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. జిల్లాలో మొదటి విడుతలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లోని పలు స్కూళ్లలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధనను కూడా అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు మీడియంతోపాటు ఇంగ్లిష్ మీడియానికి సంబంధించి ప్రత్యేకంగా పుస్తకాలను ముద్రించేందుకు నిర్ణయించారు.
ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియాన్ని అమల్లోకి తీసుకువస్తున్నప్పటికీ తెలుగు మీడియంలో కూడా బోధిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఇంగ్లిష్ బోధనను అందించడంతోపాటు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ బోధనను అందించేలా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దేందుకు మౌలిక సదుపాయాలను కూడా కల్పించే పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, స్కూల్ డ్రెస్‌లు కూడా ఉచితంగా అందిస్తుండడం, పదో తరగతి పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు, విద్యార్థుల దత్తత తదితర కార్యక్రమాలతో మెరుగైన ఫలితాలు సాధిస్తుండడం వంటి కసరత్తును అమలుచేస్తున్నారు.
ఉపాధ్యాయులకు ఆన్లైన్లో శిక్షణ షురూ..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధనను అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకుగాను జిల్లాలోని ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ సన్నద్ధం చేస్తున్నది. ఉపాధ్యాయులకు ఇప్పటికే నాలుగు సబ్జెక్టులపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం పూర్తయింది. గణితం, సాంఘికశాస్త్రం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులపై ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చారు. జిల్లావ్యాప్తంగా 22 కేంద్రాల్లో ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చారు. ఉపాధ్యాయులు ఇంగ్లిష్ మీడియంపై పట్టు సాధించేందుకుగాను ఎస్జీటీలకు మూడు విడుతల్లో శిక్షణనివ్వగా, స్కూల్ అసిస్టెంట్లకు రెండు విడుతల్లో శిక్షణనిచ్చారు. ఒక్కో విడుతలో ఐదు రోజుల చొప్పున ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతోపాటు కోర్స్ ఆనలిస్ట్‌లతో శిక్షణనిచ్చారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఇప్పటికే పూర్తికాగా, ప్రస్తుతం ఆన్లైన్లో శిక్షణా కార్యక్రమం కొనసాగుతున్నది. బుధవారం నుంచి ఉపాధ్యాయులకు ఆన్లైన్లో శిక్షణనిస్తున్నారు.
ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులకు సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంద్రరావు పర్యవేక్షిస్తున్నారు. ఎస్టీలకు సంబంధించి మొత్తం 3028 మంది ఉపాధ్యాయులకు శిక్షణనివ్వగా, మొదటి విడుతలో 1030 మంది ఉపాధ్యాయులు, రెండో విడుతలో 1073 మంది ఉపాధ్యాయులు, మూడో విడుతలో 925 మంది ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చారు. మన ఊరు-మన కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 124 స్కూళ్లలో ఆయా పనులకు సంబంధించి 1026 పనులకు అంచనాలు పూర్తికాగా, సంబంధిత పనులకు రూ.57.30 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. మరోవైపు రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన శివరాంపల్లి, జిల్లెలగూడ ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు-మన బడిలో భాగంగా చేపట్టిన మౌలిక సదుపాయాలను కల్పించే పనులు దాదాపు పూర్తికాగా, వారం రోజుల్లో వందశాతం పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. 12 అంశాలను పరిగణనలోకి జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనాలను రూపొందించారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్, గ్రీన్ చాక్‌బోర్డులు, పెయింటింగ్, ప్రహరీ నిర్మాణం, కిచెన్ షెడ్లు, శిథిలమైన తరగతి గదులకు మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లు వంటి పనులను ప్రభుత్వ పాఠశాలల్లో చేస్తున్నారు.
ఉపాధ్యాయులకు కొనసాగుతున్న ఆన్లైన్ శిక్షణ
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుకు సంబంధించి ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంద్రరావు తెలిపారు. ఇప్పటికే శిక్షణ కార్యక్రమం పూర్తికాగా, ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా ఉపాధ్యాయులకు ఆన్లైన్లో శిక్షణనిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించే పనులు కొనసాగుతున్నాయన్నారు. మొదటి విడుతలో 464 స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించగా, ఇప్పటివరకు 124 స్కూళ్లలో పనులు ప్రారంభమయ్యాయని డీఈవో వెల్లడించారు.
–సుశీంద్రరావు, జిల్లా విద్యాశాఖ అధికారి