పరిగి/షాబాద్, ఏప్రిల్ 29 : హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణకు హరితహారం, దళితబంధు, యాసంగి వరి ధాన్యం సేకరణ అమలుపై బీఆర్కే భవన్ నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ ఏడాది రాష్ట్రంలో 19.5కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించిందని, హరితహారం విజయవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం 7.70శాతం పెరిగిందన్నారు. దళితబంధు యూనిట్లు వెంటనే గ్రౌండింగ్ చేయాలన్నారు.
అనంతరం వికారాబాద్ కలెక్టర్ నిఖిల హరితహారంలో చేపట్టాల్సిన పనులు, దళితబంధు, వరి ధాన్యం సేకరణ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. హరితహారంలో ప్రధాన రహదారుల వెంట మొక్కలు నాటేందుకు గుంతలు తీసి సిద్ధంగా ఉంచాలన్నారు. డీఆర్డీవో, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. మన్నెగూడ-కొడంగల్, తాండూరు-కొడంగల్ ప్రధాన రోడ్లలో పెద్ద మొత్తంలో మొక్కలు నాటి పచ్చదనంతో నిండిపోయేలా చూడాలన్నారు. జిల్లాలో వర్తక, వ్యాపారుల సంఘాలను సమావేశపరిచి ప్రతి దుకాణం ముందు తప్పనిసరిగా మొక్కలు నాటించాలన్నారు.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అవెన్యూ ప్లాంటేషన్‌తోపాటు తక్కువ స్థలం ఉన్న ఏరియాల్లో సిమెంటు రింగులతో మట్టి వేసి రంగురంగుల పూలమొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా అటవీ శాఖ అధికారి వేణుమాధవ్, డీఆర్డీవో కృష్ణన్, డీపీవో మల్లారెడ్డి, డీఈవో రేణుకాదేవి, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, నీటి పారుదల శాఖ ఈఈ సుందర్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ మాట్లాడుతూ…8వ విడత తెలంగాణకు హరితహారంలో రంగారెడ్డి జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయుటకు ప్రణాళిక సిద్ధం చేసుకుని లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరిని కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. దళితబంధు మొదటి విడతలో జిల్లాలో 697 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 50మందికి యూనిట్ల మంజూరు పత్రాలను, ట్రాన్స్పోర్ట్ వాహనాలను పంపిణీ చేశామని, మిగిలిన వారికి ఎంచుకున్న యూనిట్లను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ కలెక్టర్లు తిరుపతిరావు, ప్రతీక్‌జైన్, జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి,జిల్లా పౌరసరఫరాల అధికారి శ్యామలక్ష్మి, జడ్పీ సీఈవో దీలిప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.