వికారాబాద్/మర్పల్లి, ఏప్రిల్ 29;రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం జరిగిన మర్పల్లి మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో కలిసి వారికి మర్పల్లి, మోమిన్‌పేట్, బంట్వారం మండలాల నాయకులు అంబేద్కర్ చౌరస్తా నుంచి మార్కెట్ యార్డు వరకు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌గౌడ్, వైస్ చైర్మన్ రామేశ్వర్, డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేలా మార్కెట్ కమిటీ పని చేయాలన్నారు. అలాగే వికారాబాద్ శివారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మంత్రి సబితారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘మన ఊరు-మన బడి’తో పాఠశాలలు మరింత బలోపేతం కానున్నాయన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులకు ఉపయోగపడే విధంగా పాలకవర్గం కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మర్పల్లి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మర్పల్లి, మోమిన్‌పేట్, బంట్వారం మండల నాయకులు, ఒగ్గు కళాకారులు, రైతులతో కలిసి అంబేద్కర్ చౌరస్తా నుంచి మార్కెట్ యార్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ముందుగా జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌గౌడ్, వైస్ చైర్మన్ రామేశ్వర్తోపాటు డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాల వారికి మార్కెట్ కమిటీలో అవకాశం కల్పించిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పడిన తరువాత రైతులకు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా కింద రైతు మరణించిన వారంలో నామినీ ఖాతాలో రూ.5లక్షలు జమ చేయడం జరుగుతుందన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలన్నారు. కాళేశ్వరం ప్రాజేక్టు దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు.
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు త్వరలో పూర్తైతే పాలమూరు, ఉమ్మడి రంగారెడ్డి రైతులకు లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. అవకాశాలు అందరికీ ఒకేసారి రావని, అందరికీ న్యాయం చేస్తామని, ఎవరూ కూడా అధైర్యపడొద్దన్నారు. సీఎం కేసీఆర్ సూచనలతో నిరుద్యోగుల కోసం ఎక్కడికక్కడ ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులకు ఉపయోగపడే విధంగా పాలకవర్గం కృషి చేయాలని సూచించారు.
అనంతరం మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, వైస్ చైర్మన్ రామేశ్వర్ డైరెక్టర్లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మర్పల్లి, మోమిన్‌పేట్ ఎంపీపీలు రమేశ్, వసంత, జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు సోహెల్, మర్పల్లి, బంట్వారం, మోమిన్‌పేట్ మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి, రాములు, వెంకట్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశం, రైతుబంధు అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
నవాబుపేట, ఏప్రిల్ 29 : మండల పరిధిలోని పూలపల్లి గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది. ముఖ్యఅతిథిగా విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి హాజరై మాట్లాడారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. కులమతాలకు అతితంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం గ్రామస్తుల ఐక్యతకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాద య్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, దళిత స్త్రీ శక్తి అవార్డు గ్రహీత భాగ్యలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, సర్పంచ్ నర్సింహారెడ్డి, నాయకులు, పాల్గొన్నారు.
రంజాన్ సరుకుల పంపిణీ అభినందనీయం
మోమిన్‌పేట, ఏప్రిల్ 29 : రంజాన్ సందర్భంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని మంత్రి సబితారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆల్ మోమిన్ ట్రస్టు సభ్యులు నిరుపేద కుటుంబాలకు మంత్రి, ఎమ్మెల్యే చేతులమీదుగా సరుకులు పంపిణీ చేశారు. ముస్లిం సోదరులకు ఈసందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ మోమిన్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.