యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి);హరిహరాదుల నిలయమైన యాదాద్రి దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక రాజధానిగా భాసిల్లుతున్నది. అపరవైకుంఠంలా రూపుదిద్దుకున్న పంచనారసింహుడి ఆలయానికి అనుబంధమైన పర్వత వర్ధినీ రామలింగేశ్వరాలయం వెండి వెలుగుల కైలాసాన్ని తలపిస్తున్నది. సీఎం కేసీఆర్ సంకల్పంతో పునర్నిర్మితమైన ఆలయ ఉద్ఘాటన పర్వం సోమవారం వైభవోపేతంగా సాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు స్వయంగా మహా పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం మహోత్సవాల్లో పాల్గొన్నారు. స్పటిక లింగానికి అభిషేకం చేశారు. ఉద్ఘాటన అనంతరం నిజరూప దర్శనాలకు అనుమతివ్వడంతో యాదాద్రికి వచ్చిన భక్తులు హరి హరులను దర్శించుకుని తరించారు.
10.25 గంటలకు స్పటిక లింగ ప్రతిష్ఠ
రామలింగేశ్వరుడి మహాకుంభాభిషేకోత్సవాలు ఈ నెల 20న మొదలై స్మార్తాగమ సంప్రదాయరీతిలో కన్నుల పండువగా సాగాయి. సోమవారం ఉదయం 10.25 గంటలకు శ్రీరాంపురం పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామీజీ చేతులమీదుగా రామలింగేశ్వర స్పటిక లింగ ప్రతిష్ఠ జరిగింది.
మూడున్నర గంటలు..
ఉదయం 11.56 గంటలకు యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులు గర్భాలయంలో లక్ష్మీనరసింహుడి దర్శనం అనంతరం శివాలయానికి చేరుకున్నారు. స్పటిక లింగానికి అభిషేకం చేశారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు ఎర్రవల్లికి తిరుగు ప్రయాణమయ్యారు.
నాడు 500 గజాల్లో.. నేడు ఎకరం విస్తీర్ణంలో..
గతంలో 500 గజాల్లో మాత్రమే ఉన్న రామలింగేశ్వరాలయం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఎకరం విస్తీర్ణంలో, రూ.8కోట్లతో రూపుదిద్దుకున్నది. నిర్మాణానికి 3 మెట్రిక్ టన్నుల కృష్ణశిలను వినియోగించారు.