శంకర్పల్లి, ఏప్రిల్ 24 : దశాబ్దాలు గడుస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లోని సంతలు, అంగళ్లకు ఆదరణ తగ్గడం లేదు. నగర వాసులకు షాపింగ్‌మాళ్లు, రిలయన్స్ ఫ్రెష్‌లు ఎంత ప్రియమో పల్లెల్లో నివసించే వారికి సంతలు, అంగళ్లు అంతే. దశాబ్దాల క్రితమే గ్రామీణ ప్రాంతాల్లో వారాంతపు సంతలు ఏర్పడ్డాయి. వారం రోజులు కష్టపడి సంపాదించిన డబ్బుతో అంగళ్లకు చేరుకొని వారికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. నేటికీ ఈ సంప్రదాయం కొనసాగుతున్నది. అంగళ్లలో కావలసిన వస్తువులు సరసమైన ధరలకు లభిస్తుండటంతో నేటికీ సంతలకు ఆదరణ లభిస్తున్నది. పిన్నుల నుంచి గృహోపకరణాల వరకు కావలసిన వస్తువులు అక్కడ లభిస్తున్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రోజు అంగళ్లు జరుగుతాయి. శంకర్పల్లి పట్టణంలో ఆదివారం, బుధవారం అంగళ్లు జరుగుతాయి. ఈ రెండు రోజుల్లో మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, కార్మికులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి తమకు కావాల్సిన వారాంతపు సరుకులు కొనుగోలు చేస్తుంటారు. ప్రతి వారం లక్షల రూపాయల వ్యాపారాలు జరుగుతాయి. కూరగాయల నుంచి బట్టలు, చెప్పులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మహిళల కాస్మొటిక్ వస్తువులు, ఆటబొమ్మలు, వంట సామగ్రి తదితర నిత్యావసర వస్తువులు లభిస్తున్నాయి. వ్యాపారుల అధిక లాభాలు చూసుకోకుండా సరసమైన ధరలకే వస్తువు లు విక్రయిస్తుంటారు. దీంతో కొనే వారికి, అమ్మే వారికి ఎ లాంటి నష్టం ఉండదు. మున్సిపాలిటీకి అంగడి తైబజార్ రూ పంలో రూ.10 లక్షల వరకు ఆదాయం సమకూరుతున్నది.