సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాల ప్రజలకు గుదిబండగా మారిన 111 జీవోను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. సర్కార్ నిర్ణయంతో ఆ జీవో పరిధిలో ఉన్న ప్రాంతాలు గ్రీన్‌సిటీగా అభివృద్ధి చెందనున్నాయి. ఎన్నో ఏండ్లనాటి కల సీఎం కేసీఆర్ చొరవతో నెరవేరడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యకం చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రీనరీకి ప్రాధాన్యతనిస్తూ నిర్మాణాలకు అనుమతి లభించనుండడంతో ఇక్కడి భూముల ధరలు భారీగా పెరిగే అవకాశమున్నది. భారీగా క్రయవిక్రయాలతో రియల్ వ్యాపారం జోరందుకోనున్నది. గతంలో ఏ ప్రభుత్వమూ మా వినతులు, బాధలను పట్టించుకోలేదని.. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 111 జీవో ఎత్తివేయడం సంతోషంగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. 111 ఆంక్షలతో తాము పడుతున్న ఇబ్బందులను గుర్తించి మేలు చేసిన సీఎం కేసీఆర్ సార్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటామని ప్రకటించారు.
దినదినాభివృద్ధి చెందుతున్న మహానగరంలో కొత్త సిటీ చేరబోతోంది. ఇప్పటివరకు ఓల్డ్‌సిటీ, న్యూసిటీ, హైటెక్‌సిటీతో పేరుగాంచిన నగరసిగలో గ్రీన్‌సిటీ చోటు దక్కించుకోనుంది. జంటనగరాల దాహార్తి తీర్చిన హిమాయత్‌సాగర్, గండిపేట జంట జలాశయాల పరిరక్షణ కోసం అప్పటి ప్రభుత్వం ఇచ్చిన 111 జీవోను షరతులతో ఎత్తివేశారు. తాజాగా జీవో 69 విడుదల చేసి జలాశయాల పరిరక్షణతోపాటు చుట్టుపక్కల పచ్చదనం పెంపునకు (గ్రీన్‌సిటీ) పటిష్ట చర్యలు తీసుకోవాలని జీవోలో పొందుపరిచారు. ప్రభుత్వ నిర్ణయంతో నగరం నలుమూలలా విస్తరించేందుకు అడ్డంకులు తొలగాయి. కొత్తగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉన్న ఈ ప్రాంతంలో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణతో గ్రీన్‌సిటీగా మార్చేందుకు పక్కా చర్యలు తీసుకోనున్నారు.
ఐటీ కారిడార్‌కు అతి సమీపంలో..
111 జీవో పరిధిలోని ప్రాంతాలు ఐటీ కారిడార్‌ను ఆనుకొనే ఉండడంతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కోకాపేట, వట్టినాగులపల్లి నుంచి మొదలై ఔటర్ మీదుగా శంషాబాద్ వరకు ఉన్న ప్రాంతమంతా ఐటీ కంపెనీలకు, నివాస ప్రాంతాలకు అత్యంత అనుకూలం. ఐటీ కంపెనీల ఏర్పాటు వల్ల కాలుష్యం తక్కువగా ఉండడం, వాక్ టు వర్క్ కాన్సెప్ట్‌తో ఐటీ కారిడార్ పరిధి శంషాబాద్ వరకు విస్తరించనుంది. దీనికనుగుణంగా ప్రభుత్వం ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించి అమలు చేయనుంది.
శివార్లపై నగరవాసుల ఆసక్తి
కరోనా ఉపద్రవం తర్వాత నగరవాసుల జీవనశైలిలో అనేక మార్పులొచ్చాయి. కోర్‌సిటీలో అపార్టుమెంట్లు, రద్దీ ఉండే ప్రాంతాలు, బస్తీలు, కాలనీల్లో ఉండడం కన్నా శివారు ప్రాంతాల్లో విశాలమైన స్థలంలో ఇండ్లు నిర్మించుకొని ప్రశాంతంగా జీవితాన్ని గడపాలన్న ఆలోచన పెరిగింది. 111 జీవో పరిధిలో వేలాది ఫామ్‌హౌస్‌లు ఉండడంతో అక్కడే నెలల తరబడి ఉంటూ తమ కార్యకలాపాలు నిర్వహించారు. శివారు ప్రాంతాలకు నగరంతో అనుసంధానంగా ఔటర్‌రింగు రోడ్డు సైతం అందుబాటులో ఉండడం కలిసొచ్చే అంశం.
పర్యాటక ప్రాంతాలుగా జంట జలాశయాలు
హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు జంట జలాశయాలైన గండిపేట(ఉస్మాన్‌సాగర్), హిమాయత్‌సాగర్‌లు నిజాంల కాలం నుంచి తాగునీటిని అందిస్తూ వచ్చాయి. నగరం గణనీయంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నగరానికి కృష్ణా, గోదావరి నదుల నుంచి పెద్ద మొత్తంలో నీటిని అందుబాటులోకి తెచ్చి, జంట జలాశయాల నీటిని గత 3-4 ఏళ్లుగా తాగునీటికి వినియోగించకుండా పూర్తి స్థాయిలో నిల్వ ఉంచడంతో నిత్యం నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జంట జలాశయాలను పర్యాటక ప్రదేశాలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే గండిపేటలో రూ.35 కోట్లతో పార్కుల సుందీరకరణ చేపట్టింది.
అందుబాటులోకి 1.32 లక్షల ఎకరాలు
జీవో 111 ఎత్తివేతతో సుమారు 1.32లక్షల భూమి అందుబాటులోకి రానుంది. దీనివల్ల భూముల ధరలు సామాన్యులకు కలిసి రావడమే కాకుండా నగరంపై ఒత్తిడి తగ్గనుంది. ఇప్పటివరకు నిబంధనలతో అభివృద్ధికి దూరమైన ఆ ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందనున్నాయి. ఐటీ, పారిశ్రామిక సంస్థలకు కావాల్సినంత భూమి అందుబాటులో ఉండనుంది.
69 జీవోతో ఎత్తివేయనున్న ఆంక్షలు ఇవే..
శాశ్వత పరిష్కారం
111 జీవో ఎత్తివేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం వల్ల 84 గ్రామాల ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. 69 జీవోపై కోర్టుకు వెళ్లకుండా ప్రభుత్వం పకడ్బందీగా కసరత్తు చేయడం శుభసూచకం. 84 గ్రామాల ప్రజలకు ఎంతో ఊరట లభించింది.
–పి.కార్తీక్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత
26 ఏండ్ల కల నెరవేరింది..
సీఎం కేసీఆర్ 84 గ్రామాల వారికి విముక్తి కల్పించారు. మొయినాబాద్ మండలంలోని గ్రామాలు పూర్తిగా జీవో 111 పరిధిలో ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీఎం కేసీఆర్ 84 గ్రామాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.
–ఎల్గని చంద్రలింగంగౌడ్, మాజీ జడ్పీటీసీ, మొయినాబాద్