కులకచర్ల, ఏప్రిల్ 20 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం గర్భిణులకు వరంగా మారింది. గర్భిణులకు దవాఖానలకు చేర్చడం, ప్రసవం తర్వాత ఇంటికి చేరవేయడంలో 102 వాహనం ఉత్తమ సేవలను అందిస్తున్నది. ప్రైవేటు వాహనాల కోసం ఎదురుచూడకుండా ఫోన్ చేసి కొద్ది సమయంలోనే 102 వాహనం ఇంటి వద్దకు వచ్చి దవాఖానకు చేర్చడంతో పాటు వైద్య పరీక్షలు అయిన తర్వాత ఇంటింకి చేర్చుతుండడంతో గర్భిణులకు ఎంతో ప్రయోజనం చేకూరుతున్నది. అంతేకాకుండా కాన్పు అయిన తర్వాత పైసా ఖర్చు లేకుండా తల్లీబిడ్డలను ఇంటికి చేర్చుతుండడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
102 వాహనం అందించే సేవలు..
గర్భం దాల్చినప్పటి నుంచి 9 నెలలు పూర్తయ్యే వరకు నాలుగుసార్లు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు నానా కష్టాలు పడి, ప్రభుత్వ దవాఖానలకు వెళ్తుంటారు. కొన్ని గ్రామాల్లో రవాణా సౌకర్యం కూడా ఉండదు. ఆటోలు, జీపులు, 108, ఇతర వాహనాల్లో వెళ్తుంటారు. దీంతో అనారోగ్యాలకు గురువుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం 102 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఏఎన్ఎం ఎంత మంది గర్భిణులు గ్రామంలో ఉన్నారన్న విషయాన్ని నమోదు చేసుకుంటారు. అ రోజు ఎంత మందికి ఆంటినాటల్ చెకప్స్ చేయాలో తెలుసుకొని 102 వాహనాలకు ఫోన్ చేస్తే వాహనం వచ్చి దవాఖానకు తీసుకెళ్తుంది.
సేవలను వినియోగించుకోవాలి..
మహిళలు 102 వాహన సేవలను వినియోగించుకోవాలి. ఫోన్ చేస్తే క్షణాల్లో సంబంధిత స్థలానికి వాహనం చేరుకుంటుంది. వాహనంలో అంటినెంటల్ చెకప్స్తో పాటు డిశ్చార్జీ తర్వాత ఇంటికి చేర్చుతుంది.
– డాక్టర్ మురళీకృష్ణ, మండల వైద్యాధికారి,కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం