పరిగి, ఏప్రిల్ 19: ఉమ్మడి రాష్ట్రంలో 2009లో అప్పటి ప్రభుత్వం అభయ హస్తం పథకాన్ని ప్రారంభించింది. ప్రతి ఏడాది కొంత డబ్బులు చెల్లిస్తే ప్రభుత్వం తరఫున బీమా కంపెనీలకు అందజేసి, 60 ఏండ్లు నిండిన మహిళలకు పింఛన్ ఇవ్వాలన్నది ఈ పథకం ఉద్దేశం. అయితే ఈ పథకం కొంత కాలం కొనసాగినా తెలంగాణ రాష్ర్టావిర్భావం తర్వాత ఆసరా పింఛన్లను అందిస్తుండడంతో అభయహస్తం నిలిచిపోయింది. తాము చెల్లించిన డబ్బులను తిరిగి ఇప్పించాలని మహిళలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా, సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మహిళలు కట్టిన డబ్బులకు వడ్డీతో సహా కార్పస్ ఫండ్ చెల్లించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ లబ్ధిదారుల ఖాతా నంబర్లను ఇప్పటికే సేకరించింది. త్వరలో డబ్బులు ఖాతాల్లో జమ కానుండడంతో వికారాబాద్ జిల్లా పరిధిలోని 51,297 మందికి లబ్ధి చేకూరనున్నది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
అభయహస్తం లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులు కట్టిన డబ్బులను వడ్డీతో కలిపి చెల్లించాలని నిర్ణయించింది. వికారాబాద్ జిల్లాలోని లబ్ధ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను నాలుగైదు రోజుల్లో జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వయం సహాయక సం ఘాల పరిధిలోని సభ్యులు ఒక్కొక్కరూ ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే వారికి 60 ఏండ్లు నిండిన తర్వాత ఒక్కొక్కరికీ నెలకు రూ.500 చొప్పున పింఛన్ ఇచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు.
సుమారు తొమ్మిదేండ్లపాటు ప్రభు త్వం నిర్దేశించిన ప్రీమియాన్ని గ్రూప్ సభ్యులు చెల్లిస్తూ వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 61 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ ‘ఆసరా’ పింఛన్ పంపిణీ మొదలైంది. ప్రభుత్వం ఒక్కో పింఛనుదారుకు నెలకు రూ.2,016 చొప్పున పింఛన్ అందిస్తున్నది. పింఛన్ తీసుకుంటున్న వారిలో స్వయం సహాయక సంఘాల సభ్యులూ ఉన్నారు. దీంతో గ్రూప్ సభ్యులు అభయహస్తం పథకంపై విముఖత చూపించారు. అప్పటి నుంచి వేలాది మంది ఏటా ప్రీమియా న్ని చెల్లించడం మానేశారు. గతంలో చెల్లించిన ప్రీమియాన్ని తిరిగి ఇవ్వాలని మహిళలు ప్రభుత్వాన్ని కోరగా.. స్పందించిన సీఎం కేసీఆర్ వడ్డీతో కలిపి చెల్లించేందుకు అంగీకరించారు.
దీంతో జిల్లా పరిధిలోని 51,297 మంది లబ్ధిదారులకు మేలు జరుగనున్నది. ఇందులో ఎస్సీ లు 15,653మంది, ఎస్టీలు 7,569 మంది, బీసీలు 23,120 మంది, ఓసీలు 2,742 మంది, మైనారిటీలు 2,213 మంది ఉన్నారు. ఈ పథకం నిలిచిపోయి కొన్ని ఏండ్లు కావడంతో సభ్యుల వివరాలతోపాటు వారి బ్యాంకు ఖాతాల నంబర్లను గ్రామీణాభివృద్ధ్ది శాఖ సిబ్బంది సేకరించి అప్డేట్ చేయడం జరిగింది.
2009లో ప్రారంభమై..
ఈ పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009లో ప్రారంభమైంది. ఈ పథకంలో పేరు నమోదు చేసుకున్న మహిళలకు 60 ఏండ్లు నిండిన తర్వాత ప్రతినెలా రూ.500 నుంచి రూ.2 వేల వరకు పింఛన్‌ను అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల్లో 18 నుంచి 59 ఏండ్లలోపు ఉన్న మహిళలు తమ పేరు నమోదు చేయించుకొని వయసు ఆధారంగా తమ వాటా డబ్బులు ప్రతిఏటా రూ. 365 నుంచి రూ.2వేల వరకు చెల్లించారు. ఈ డబ్బులకు ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో జమ చేసి బీమా కంపెనీలకు అందజేసేది.
ఇదిలావుండగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా పింఛన్లను రూ. వెయ్యికి పెంచడం జరిగింది. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పింఛన్లను రూ.2016కు పెంచింది. ఇటీవలె ప్రభు త్వం 57 ఏండ్లు నిండిన వారందరికీ ఆసరా పింఛన్లు రూ.2016 అందించడం జరుగుతుందని ప్రకటించింది. దీంతో పింఛను తీసుకుంటున్న వారిలో స్వయం సహాయక సంఘాల సభ్యులూ ఉన్నారు. దీంతో గ్రూప్ సభ్యులు అభయహస్తం పథకంపై విముఖత చూపించారు. ఏటా ప్రీమియం డబ్బులను చెల్లించడం మానేశారు. కాగా డబ్బులు త్వరలోనే చేతికి అందనుండటంతో సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
అభయహస్తం పథకంలో పింఛన్ కోసం పదేండ్ల కితం ఈ పథకంలో చేరా. ఏడాదికి రూ.380 చొప్పున నాలుగేండ్ల పాటు చెల్లించడం జరిగింది. ఆ తర్వా త సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చి పిం ఛన్ను రూ.2,016 పెంచింది. దీంతో అప్పటి నుంచి ప్రీమియాన్ని చెల్లించలేదు. నేను కట్టిన డబ్బులు ఇక రావని అనుకున్నా. కానీ సీఎం కేసీఆర్ వడ్డీతో కలిపి ఆ డబ్బులను చెల్లిస్తానని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
–గోవిందమ్మ, దుద్యాల, బొంరాస్‌పేట
సభ్యుల వివరాలను సేకరించాం..
అభయహస్తం ప్రీమియాన్ని వడ్డీతో కలిపి చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లబ్ధ్దిదారుల బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించడంతోపాటు అప్డేట్ చేయడం కూడా పూర్తయింది. నిధులు విడుదల కాగానే నేరుగా లబ్ధ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. ఇందుకు సం బంధించి రాష్ట్ర స్థాయిలోని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
– కృష్ణన్, డీఆర్డీవో వికారాబాద్ జిల్లా