కడ్తాల, ఏప్రిల్ 19 : రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ దశరథ్‌నాయక్ కోరారు. మంగళవారం కడ్తాల పశువైద్య కార్యాలయం ఆవరణలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 49 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి సరఫరా అయిన పెరటి కోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ చిన్న, మధ్య తరగతికి చెందిన కుటుంబాలు తమ వ్యవసాయ పొలాలు, ఇంటి ఆవరణలో పెరటి కోళ్లను పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ గంప వెంకటేశ్, పశువైద్యాధికారి భానునాయక్, సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, వార్డు సభ్యులు గణేశ్, భిక్షపతి, నరేందర్‌రెడ్డి, సుజాత, శ్రీను, నాయకులు వెంకటయ్య పాల్గొన్నారు.
పెరటి కోళ్లతో మంచి ఆదాయం
ఆమనగల్లు, : రైతులు వ్యవసాయ అనుబంధ రంగాల పై దృష్టి పెడితే ఆర్థికంగా స్థిరపడుతారని పశుసంవర్థక శాఖ అధికారి విజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆమనగల్లు పశువైద్య కార్యాలయం ఆవరణలో మండలంలోని సీతారంనగర్, శంకర్కొండతండాలకు చెందిన 27 మంది గిరిజన రైతులకు ఒక్కొక్కరికీ 25 పెరటి కోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ రైతులకు గిరిరాజ కోళ్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కోళ్ల పెంపకం కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు సబ్సిడీ కింద కోళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కోళ్ల పెంపంకం పై మక్కువ ఉన్న గిరిజన రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోళ్ల పంపిణీ కోసం రూ.600 లతో లబ్ధిదారులు డీడీలు తీసుకొని పశువైద్య కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. డీడీలు చెల్లించిన రైతుల దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం ద్వారా లబ్ధిదారులకు కోళ్లను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సిబ్బంది యాదయ్య, పాలాక్షి, రైతులు సీతారాం పాల్గొన్నారు.