పరిగి, ఏప్రిల్ 18: పరిగి పట్టణంతోపాటు పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. సాయంత్రం 4 గంటల ప్రాం తంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వడగండ్లు పరిగి, సుల్తాన్పూర్తోపాటు పలు గ్రామాల్లో పడ్డాయి. సుల్తాన్పూర్ పరిధిలో విద్యుత్ స్తంభం నేలకూలింది. రంగంపల్లి గ్రామ శివారులో పిడుగుపాటుతో గొల్ల రాములుకు చెం దిన రెండు మేకలు, నర్సింహులు, బసమ్మకు చెందిన 8 మేకలు, కిష్టమోని నర్సింహులుకు చెందిన ఆవు మృతి చెందింది. వాటి విలువ సుమారు రూ.1.80లక్షలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. పిడుగుపాటుతో షాక్‌కు గురైన గొల్ల రాములు, నర్సింహులును దవాఖానకు తరలించారు. మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది.
వికారాబాద్‌లో మోస్తరు వర్షం
వికారాబాద్, ఏప్రిల్ 18: వికారాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లు జలమయమయ్యా యి. వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. గాలి వానకు కొన్ని గ్రామాల్లో మామిడికాయలు నేలరాయాలి.
ధారూరు మండలంలో ..
ధారూరు, ఏప్రిల్ 18: మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో సోమవారం మోస్తరు వర్షం కురిసింది. దీంతో ధారూరు, నాగసముందర్ తదితర గ్రామాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
అకాల వర్షం..
చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 18: మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల విద్యుత్ తీగలు నేలకొరిగాయి
ఈదురు గాలులతో కూడిన వర్షం
కోట్‌పల్లి, ఏప్రిల్ 18: మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో సోమవారం మధ్యాహ్నం వనగండ్ల వర్షం కురిసింది. రాంపూర్ గ్రామంలో బేగరి మల్లయ్య ఇటీవలె అప్పు చేసి ఇంటిని నిర్మించుకున్నాడు. కాగా గాలి అధికంగా రావడం తో ఇంటిపై ఉన్న పై కప్పు విరిగి రేకులు గాల్లో కొట్టుకుపోయాయి.
అదే గ్రామంలో ఎస్సీ కాలనీలో విద్యుత్ స్తంభం నేలకొరిగింది. అలాగే జి న్నారం గ్రామ సమీపంలో కోట్‌పల్లి నుంచి వికారాబాద్‌కు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో కొండచరియలు విరిగి రోడ్డుపై పడటంతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.