కొందుర్గు, ఏప్రిల్ 17 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో విరివిగా మొక్కలు నాటి పెంచాలన్నది సర్కార్ సంకల్పం. కోట్ల రూపాలను ఖర్చు చేసి నర్సరీల ద్వారా మొక్కలను పెంచి గ్రామాల్లోని రైతులకు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొక్కలను ఉచితంగా సరఫరా చేయడంతో పాటు నిర్వహణ ఖర్చులు కూడా ప్రభుత్వం నెలకు ఒక్కో మొక్కకు ఐదు రూపాయలను రైతులకు అందజేస్తున్నది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి గ్రామంలో మొక్కలు విరివిగా నాటాలని అధికారులు సూచిస్తున్నారు.
జిల్లెడ్చౌదరిగూడ మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. జిల్లెడ్ చౌదరిగూడ మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ నర్సరీలను ఏర్పాటు చేశారు. మండలంలోని పెద్ద ఎల్కిచర్ల గ్రామంలో ఉపాధి హామీ నర్సరీతో పాటు సోషల్ ఫారెస్ట్ నర్సరీని ఏర్పాటు చేసి లక్షా 50వేల మొక్కలు పెంచుతున్నారు. ఒక్కో గ్రామానికి 18వేల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మండలంలో ఉన్న మొక్కలు సరిపడక పోతే ఇతర మండలాల నుంచి మొక్కలు తీసుకువచ్చి నాటిస్తామని అధికారులు తెలిపారు.
పకడ్బందీగా మొక్కల పెంపకం
జిల్లెడ్చౌదరిగూడ మండలంలోని అన్ని గ్రామాల్లో పకడ్బందీగా మొక్కలు నాటి పెంచేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణకు హరితహారాన్ని ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వం తమకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని వారు తెలిపారు.
ప్రణాళికలు రూపొందిస్తున్నాం..
జిల్లెడు చౌదరిగూడ మండలంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణకు హరిత హారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటేందుకు నర్సరీల్లో మొక్కల పెంపకం చేపడుతున్నాం. జిల్లెడు చౌదరిగూడ మండలంలోని మొత్తం 24 గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ప్రభుత్వం మా మండలానికి ఇచ్చిన లక్ష్యాన్ని చేరడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం.
– ప్రవళిక, ఏపీవో జిల్లెడు చౌదరిగూడ మండలం