ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 17: జిల్లాలో నేటి నుంచి ఐదు డివిజన్లలో మెగా హెల్త్ మేళాలను నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్వో నాగజ్యోతి తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ నేటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు మెగా హెల్త్ మేళాలు కొనసాగుతాయని, వాటికి హాజరైన వారికి ఆయుష్మాన్ భారత్ ఐడీ కార్డులను అందిస్తామన్నారు. వివిధ సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల నివారణకు ప్రజల్లో ఆరో గ్య అవగాహన కల్పించేందుకు ఈ మేళాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాధులను త్వరగా గుర్తించడం, మందులు, హెల్త్ స్పెషలిస్టు వర్క్, అవసరమైన వారిని ఇతర దవాఖానలకు పంపించడం జరుగుతుందన్నారు. ఇందులో సాధారణ వైద్యం, మాతాశిశు ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ కౌన్సెలింగ్, కుటుంబ సం క్షేమ ఐఈసీ, చెవి, ముక్కు, గొంతు, దంతాల పరీక్షలు, చర్మ సంబంధిత పరీక్ష, పోషకాహార కౌన్సెలింగ్, కుష్టు, క్షయ నియంత్రణ, మలేరియా, అంధత్వ నివారణ, క్యాన్సర్ నియంత్రణపై అవగాహన, వ్యక్తిగత, పర్యావరణ, పారిశుధ్యం, పునరావాసం, భారతీయ వైద్య విధానాలు, ఎగ్జిబిషన్ తదితర కార్యక్రమాలు ఈ-సంజీవిని ద్వారా మెరుగైన వైద్యంతోపాటు యోగా, బీపీ, షుగర్ తదితర వ్యాధులున్న వారికి మెరుగైన వైద్యసేవలందిస్తారని తెలిపారు. రోగులు హాజరై వైద్య సేవలను పొందాలని సూచించారు. అలాగే, సబ్సెంటర్లలోని ఏఎన్ఎంలు కూడా ఈ పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. 18న చేవేళ్లలో, 19న ఇబ్రహీంపట్నంలో, 20న సరూర్నగర్, ఫరూఖ్నగర్లలో, 21న రాజేంద్రనగర్లో, 22న కందుకూరులో హెల్త్ మేళాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.