రంగారెడ్డి, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి దళితబంధు పథకం అమలు కానున్నది. సరూర్‌నగర్‌లోని వీఎం హోంలో ఉదయం 9 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి 50 మంది లబ్ధిదారులకు యూనిట్లను అందజేసి జిల్లాలో దళితబంధుకు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాకు దళితబంధు కింద రూ.32 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధుల మేరకు 50 మందికి ట్రాక్టర్లు, కార్లను అందజేయనుండగా, మరో 70 మందికి మినీ డెయిరీ యూనిట్లకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాకు అవసరమయ్యే మిగతా రూ.37.80 కోట్లు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. జిల్లాలో మొత్తం 698 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.
జిల్లాలో దళితబంధు పథకానికి సంబంధించి నేడు యూనిట్లను అందజేయనున్నారు. దళితబంధు పథకంలో భాగంగా 50 మంది లబ్ధిదారులకు యూనిట్లను అందజేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఆరుగురు చొప్పున లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేయనున్నారు. నేడు పంపిణీ చేసే యూనిట్లలో అధికంగా ట్రాక్టర్లు, కార్ల యూనిట్లను అందజేయనున్నారు. సరూర్‌నగర్‌లోని వీఎం హోంలో ఉదయం 9 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు 50 మంది లబ్ధిదారులకు తొలి విడుతగా యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే దళితబంధు లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించి పూర్తి అవగాహన కూడా నిపుణులతో కల్పించారు.
జిల్లాకు దళితబంధు కింద రూ.32కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన నిధుల మేరకు 50 మందికి ట్రాక్టర్లు, కార్లను అందజేయనుండగా, మరో 70 మందికి మినీడెయిరీ యూనిట్లకు సంబంధించిన ఏర్పాట్లు సంబంధిత అధికారులు చేస్తున్నారు. జిల్లాకు అవసరమయ్యే మిగతా రూ.37.80కోట్ల నిధులు కూడా ఈ నెలాఖరులోగా ప్రభుత్వం విడుదల చేసే అవకాశమున్నందున, తదనంతరం మిగతా యూనిట్లకు సంబంధించి గ్రౌండింగ్ ప్రక్రియను చేపట్టాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు.
అదేవిధంగా జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 698మంది లబ్ధిదారులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. జిల్లాలో షాద్‌నగర్ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులు, మహేశ్వరంలో 100, చేవెళ్ల నియోజకవర్గంలో 82, ఇబ్రహీంపట్నంలో 100, ఎల్బీనగర్లో 81, కల్వకుర్తి నియోజకవర్గంలో 63, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 100, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 72 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.
70 మంది ఖాతాల్లో డబ్బులు జమ
దళితబంధు కార్యక్రమం కింద మినీ డెయిరీ యూనిట్లను ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జిల్లా యంత్రాంగం నిధులను జమ చేసింది. జిల్లావ్యాప్తంగా 70 మంది లబ్ధిదారులు మినీ డెయిరీ యూనిట్లను ఎంపిక చేసుకున్నారు. వీరందరికీ మినీ డెయిరీ ఏర్పాటులో భాగంగా షెడ్ల నిర్మాణం కోసం మొదటగా రూ.1.50 లక్షల చొప్పున సంబంధిత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. షెడ్ల నిర్మాణం పూర్తైన అనంతరం మిగతా డబ్బులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. అదేవిధంగా దళితబంధు పథకంలో భాగంగా యూనిట్స్ ఎంపికలో ఎంపికైన సంబంధిత లబ్ధిదారులు నచ్చిన యూనిట్‌ను ఎంపిక చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
మరోవైపు లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్‌కు సంబంధించి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించింది. మరోవైపు లబ్ధిదారులకు మంజూరు చేసే రూ.10 లక్షల యూనిట్లో రూ.10వేలతో రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేయనున్నారు. వ్యాపారంలోగాని ఇతరత్రా ఏదైనా కష్టమొచ్చినప్పుడు రక్షణ నిధిలోని డబ్బులతో లబ్ధిదారులను ఆదుకునేందుకుగాను రక్షణ నిధి ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.