రంగారెడ్డి, జూలై 1, (నమస్తే తెలంగాణ): హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు ఏడేండ్లలో రూ.5900 కోట్లను ఖర్చు చేసి 220 కోట్ల మొక్కలను నాటినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లోనూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గురువారం జిల్లాలోని పెద్ద అంబర్పేట్ కలాన్‌లో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. మొక్కను నాటి ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో గ్రీనరీ పెంపుదలకు రాష్ట్రవ్యాప్తంగా 109 అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని, హెచ్ఎండీఏ పరిధిలో రూ.650 కోట్లతో 59 పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నగరంలో కొన్ని ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్‌గా మారిన పరిస్థితుల్లో 1.60 లక్షల ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను హెచ్ఎండీఏ, అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
కరోనా రెండో దశతో దేశమంతా తల్లడిల్లిపోయిందని, ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు పోవడం అందరినీ కలచివేసిందన్నారు. మనకు కావాల్సిన ఆక్సిజన్ చెట్ల ద్వారానే లభిస్తుందని, భవిష్యత్ కోసం పుడమిని కాపాడేందుకు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. హరితహారాన్ని మించిన ఉదాత్తమైన, గొప్ప కార్యక్రమం మరొకటి లేదని, మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలన్నారు. తెలంగాణలో పచ్చదనం 24 శాతం నుంచి 28 శాతానికి పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిందని, రాష్ట్రంలో పచ్చదనం 33 శాతానికి చేరుకోవాలన్న సీఎం కేసీఆర్ కల నెరవేరి, దేశానికే పాఠాలు చెప్పే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సురభివాణీదేవి, శంభీపూర్ రాజు, మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ శోభ, ప్రత్యేక కార్యదర్శి ఎ.శాంతికుమారి, డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్ రెడ్డి, పెద్ద అంబర్పేట్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
20 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
హరితహారంలో భాగంగా తెలంగాణలో ఇప్పటివరకు 220 కోట్ల మొక్కలు నాటడం పూర్తయ్యింది. ఈ ఏడాది మరో 20 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ణయించాం. హరితహారం కార్యక్రమంతో రాష్ర్టానికి దేశంలో మంచి గుర్తింపు వచ్చింది. ఇతర ఏ రాష్ర్టాల్లో లేనివిధంగా తెలంగాణలో ని అన్ని పంచాయతీల్లో 15,500 నర్సరీలు ఏర్పాటు చేశాం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం హరితహారంలో భాగంగా పెద్దఎత్తున నాటిన మొక్కలతో తెలంగాణలో నాలుగు శాతం మేర అడవుల విస్తీర్ణం పెరిగింది. నెల రోజుల్లోగా 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అందుబాటులోకి తీసుకొస్తాం.
ఇప్పటివరకు 59 అర్బన్ పార్కులు పూర్తి
రాష్ట్రంలో 1.60 లక్ష ల ఎకరాలు పట్టణ ప్రాంతాలకు సమీపం లో ఉన్నాయి. వీటిని ప్రజా ప్రయోజనాల కు అనుగుణంగా తీ ర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో 109 అర్బ న్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించి, అమలు చేస్తున్నాం. ఇందుకోసం రూ.660 కోట్ల నిధులతో పార్కుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం.
హరితహారంతో సకాలంలో వర్షాలు
హరితహారం కార్యక్రమంతో సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండి, సాగు పెరిగింది. పంటల దిగుబడి కూ డా బాగా వస్తున్నది. రాష్ట్రం హరితహా రం కార్యక్రమంతో హరిత తెలంగాణ గా మారింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇంజాపూర్, నోముల అటవీ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసి, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలో చైత న్యం వచ్చింది. హరితహారం కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపడుతున్నారు. ప్రతి ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయాలి. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి. ఎడారిగా ఉన్న ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు సాగు నీరందించాలన్నారు.