పరిగి, ఏప్రిల్ 14: కేంద్ర ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకున్నా.. సీఎం కేసీఆర్ అన్నదాతలకు అండగా ఉంటామని ప్రకటించడంతో రైతులు సంబురాలు చేసుకుంటున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలుపై గురువారం వికారాబాద్ జిల్లా అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాలుగైదు రోజుల్లో జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 4 నుంచి 5వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేపట్టేవారని, ప్రస్తుతం 4లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కొంటున్నామని పేర్కొన్నారు.
యాసంగిలో రైతులు పండించిన చివరి ధాన్యం గింజనూ కొంటామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో ధాన్యం కొనుగోలుపై ఆమె సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన బాయిల్డ్ రైస్‌ను కొనబోమని కేంద్రం చెప్పడంతో రైతు లు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందని ప్రకటించారని తెలిపారు. యాసంగి వడ్లు కొనుగోలు చేసేందుకు నిర్ణయించినందుకు సీఎం కేసీఆర్‌కు వికారాబాద్ జిల్లా రైతుల తరఫున మంత్రి ధన్యవాదాలు తెలిపారు. గతంతో పోలి స్తే రైతుల పరిస్థితి చాలా మెరుగైందన్నారు.
గతంలో కరెంట్, నీళ్లు లేక, నకిలీ విత్తనాలతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ వంటి పలు అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 4 నుంచి 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం 4లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యా న్ని కొంటున్నట్లు తెలిపారు. వరి సాగులో మన రాష్ట్రం పంజాబ్‌ను దాటి దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నట్లు తెలిపారు. రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభు త్వం కొనాలని సీఎం కేసీఆర్ నేతృత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టినా ఫలితం లేదన్నారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ఒకలా, కేంద్రంలోని వారు మరో విధంగా మాట్లాడుతున్నారని మంత్రి సబితారెడ్డి మండిపడ్డారు.
యాసంగి సీజన్లో రాష్ట్రంలో
36 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైందని, రైతులు తక్కు వ ధరకు తమ ఉత్పత్తులను విక్రయించొద్దన్నారు. ధా న్యం చివరి గింజనూ ప్రభుత్వం మద్దతు ధరకు కొం టుందన్నారు. వికారాబాద్ జిల్లాలో గత యాసంగిలో 75 వేల ఎకరాల్లో వరి సాగు కాగా.. ఈసారి 40వేల ఎకరాల్లో వరిని సాగు చేశారని, 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారన్నారు. జిల్లాలో 167 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొంటామన్నారు. నాలుగైదు రోజుల్లో జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. 20 లక్షల గన్నీ బ్యాగులు అవసరమని గుర్తించామన్నారు. పక్క రాష్ట్రం నుంచి రైతులు వచ్చి ఇక్కడ విక్రయించకుండా నిఘా ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా ఎస్పీకి సూచించినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్, పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నిర్వహించిన సమీక్షా సమావేశంలో జడ్పీచైర్‌పర్సన్ సునీతారెడ్డి, కలెక్టర్ నిఖిల, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్‌రావు, డీఆర్డీవో కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.