పరిగి, ఏప్రిల్ 14: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు రంజాన్ కానుకలను పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సాధ్యమైనంత త్వరగా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని పండుగలను సమాన ప్రాధాన్యమిస్తున్నది. రంజాన్ సందర్భంగా ముస్లింలకు రంజాన్ కానుకలు, క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లకు క్రిస్మస్ గిఫ్టుల అందజేతతోపాటు విందుల ఏర్పాటు, అదేవిధంగా బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆహార భద్రత కార్డులో పేరు న్న 18 ఏండ్లు నిండిన మహిళలందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలోని పేద ముస్లింలందరికీ పంపిణీ చేసేందుకు 8,500 రంజాన్ కానుకలు వచ్చాయి. ఇప్పటికే ఆ గిఫ్టులు ఆయా నియోజకవర్గాల కేంద్రాలకు చేరుకున్నాయి.
విందులకు రూ.17 లక్షలు
నాలుగు నియోజకవర్గాల్లోని పేద ముస్లింలకు పంపిణీ చేసేందుకు 8,500 రంజాన్ కానుకలు వికారాబాద్ జిల్లాకు వచ్చాయి. తాండూరు నియోజకవర్గానికి 2,500, వికారాబాద్‌కు 2,500, పరిగికి 2,000, కొడంగల్ నియోజకవర్గంలో పంపిణీ చేసేందుకు 1,500 కానుకల ను అధికారులు నియోజకవర్గాల వారీగా ఇప్పటికే తరలించారు. అక్కడి నుంచి ఆయా మండలాలకు చేరవేయనున్నారు. అలాగే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మండల స్థాయి లేదా నియోజకవర్గ స్థాయిలో ఇఫ్తార్ విందులకోసం ప్రభుత్వం రూ.17 లక్షలను విడుదల చేసింది. తాండూరు నియోజకవర్గానికి రూ.5 లక్షలు, వికారాబాద్‌కు రూ.5 లక్షలు, పరిగికి రూ.4 లక్షలు, కొడంగల్‌కు రూ.3 లక్షల చొప్పు న ఇప్పటికే విడుదలయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక కమిటీల ఏర్పాటు తర్వాత ఈ నిధులను సంబంధిత కమిటీల బ్యాంకు ఖాతాల్లో అధికారులు జమ చేస్తారు.
పర్యవేక్షణకు అధికారులు
రంజాన్ గిఫ్టుల పంపిణీ, ఇఫ్తార్ విందులు సజావుగా జరిగేలా పర్యవేక్షించేందుకు ప్రతి నియోజకవర్గానికీ ఒక నోడల్ ఆఫీసర్, ఒక స్పెషల్ ఆఫీసర్‌ను కలెక్టర్ నిఖిల నియమించారు. వికారాబాద్ నియోజకవర్గానికి నోడల్ అధికారిగా వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, స్పెషల్ ఆఫీసర్‌గా తహసీల్దార్ షర్మిల, తాండూరుకు నోడల్ ఆఫీసర్‌గా తాండూరు ఆర్డీవో అశోక్‌కుమార్, స్పెషల్ ఆఫీసర్‌గా తహసీల్దార్ చిన్నఅప్పలనాయుడు, పరిగికి నోడల్ ఆఫీసర్‌గా జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి కోటాజీ, స్పెషల్ ఆఫీసర్‌గా తహసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి, కొడంగల్‌కు నోడల్ ఆఫీసర్‌గా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోజెస్, స్పెషల్ ఆఫీసర్‌గా తహసీల్దార్ రవీందర్‌ను నియమించారు. జిల్లా స్థాయిలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ చైర్మన్‌గా వ్యవహరించి ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. అయితే ఆయా మండలాల్లోని మసీద్ కమిటీల ఆధ్వర్యంలో నిరుపేదలైన వారిని ఎంపిక చేసి అర్హులకు గిఫ్టులను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని కమిటీలు, ప్రజాప్రతినిధులతో సమావేశమై రంజాన్ కానుకల పంపిణీతోపాటు ఇఫ్తార్ విందుల ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 18వ తేదీ లోపు లబ్ధ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సూచించారు. అనంతరం రంజాన్ గిఫ్టుల పంపిణీ, ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాకు 8,500 రంజాన్ గిఫ్టులు
రంజాన్‌ను పురస్కరించుకుని పేద ముస్లింలకు అందజేసేందుకు వికారాబాద్ జిల్లాకు 8,500 రంజాన్ గిఫ్టులు వచ్చా యి. జిల్లాలోని అన్ని మండలాల్లోని నిరుపేద ముస్లింలకు పంపిణీ చేస్తాం. మసీద్ కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నాం. ఈనెల 18వ తేదీలోపు లబ్ధ్దిదారుల జాబితాలు ఇవ్వాలని వారికి సూచించడం జరిగింది. అంతేకాకుండా ప్రభు త్వం తరఫున ఇఫ్తార్ విందుల కోసం జిల్లాకు రూ.17 లక్షలు మం జూరయ్యాయి. –సుధారాణి,వికారాబాద్ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి