మొయినాబాద్, ఏప్రిల్ 11 : తెలంగాణ రాష్ట్రంలోని మహిళల ఆర్థిక పరిపుష్టి చాలా బాగుందని.. రాజస్థాన్లో కూడా మహిళా సంఘాలను ఏర్పాటు చేసి.. ఇక్కడ అవలంబిస్తున్న విధానాలను అనుసరిస్తామని రాజస్థాన్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణకాంత్ అన్నారు. మండల పరిధిలోని అజీజ్నగర్ గ్రామాన్ని రాజస్థాన్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ బృందం సోమవారం సందర్శించింది. మహిళా స్వయం సహాయక సంఘాలతో భేటీ అయింది. సంఘాల ఏర్పాటు, సంఘాలు బ్యాంకుల ద్వారా పొందుతున్న రుణాలు, వాటితో ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు.. వారు ఆర్థికంగా ఎలా ఎదిగారో ఆ బృందం సభ్యులు తెలుసుకున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు పొంది వ్యాపారాలు చేస్తున్నామన్నారు.
వచ్చిన లాభాలతో అప్పులు కట్టుకుని ఆర్థికంగా ఎదుగుతున్నామని సంఘాల సభ్యులు అధికారుల బృందానికి తెలిపారు. గ్రామంలో 131 స్వయం సహాయక సంఘాలుండగా అందులో 97 సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.2.85 కోట్ల రుణం ఇప్పించడంతోపాటు స్త్రీనిధి బ్యాంకు ద్వారా 65 సంఘాలకు రూ.54లక్షలు అప్పులు ఇచ్చినట్లు డీఆర్డీవో ప్రభాకర్ అధికారులకు వివరించారు. తీసుకున్న అప్పులను సంఘంలోని సభ్యులకు పంపిణీ చేయడానికి సంఘం సమావేశం ఏర్పాటు చేసి షరతులు పెట్టి రుణాలు ఇస్తున్నామని జిల్లా అధికారులు తెలిపారు. సంఘం లావాదేవీలను ఆన్లైన్లో పొందుపర్చడం జరుగుతుందని చెప్పారు.
సంఘాల పనితీరు తెలుసుకున్న కృష్ణకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదుగడం చాలా బాగుందన్నారు. సంఘాల లావాదేవీల నిర్వహణ కోసం పెట్టిన రికార్డులు కూడా అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. రాజస్థాన్ రాష్ట్రంలో కూడా తెలంగాణ మాదిరిగానే మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారు అవలంబిస్తున్న విధానాలను రాజస్థాన్లోనూ అమలు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు బాటలు వేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాజస్థాన్ గ్రామీణ అభివృద్ధి ప్రత్యేక కార్యదర్శి హర్దీప్సింగ్, ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్ఎస్ జోధ, డీఆర్డీవో ప్రభాకర్, స్త్రీ నిధి మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్, అదనపు డీఆర్డీవో జంగారెడ్డి, జడ్ఎంవై రమేశ్, జేడీఎం హమీద్, ఎంపీడీవో సంధ్య, సర్పంచ్ సంధ్య, ఎంపీటీసీ సుజాత, ఏపీఎం రవీందర్ పాల్గొన్నారు.