షాబాద్, ఏప్రిల్ 9 : రంగారెడ్డి జిల్లాలోనే పేరుగాంచిన దేవాలయాల్లో మండలంలోని సీతారాంపూర్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం కల్యాణానికి ముస్తాబైంది. ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా దేవాలయంలో సీతారాముల కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం మ ధ్యాహ్నం 12గంటలకు సీతారాముల కల్యాణం జరుగుతుందని తెలిపారు. ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు చోటు చేసుకోకుండా షాబాద్ సీఐ అశోక్‌కుమార్ సిబ్బందితో కలిసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్న ట్లు వివరించారు. అదే విధంగా మండలంలోని వివిధ గ్రా మాల్లో శ్రీరామ నవమికి ఆలయాలు ముస్తాబయ్యాయి.
హయత్‌నగర్ రూరల్ : కరోనా కారణంగా సామూహిక పూజలకు దాదాపు రెండేండ్లపాటు విరామం అనంతరం వస్తున్న శ్రీరామనవమి కోసం అన్నిచోట్ల ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉగాది పండుగ వచ్చినా అది ఇండ్లలోనే జరుపుకునే ఉత్సవం కావడం.. కరోనా దాదాపు తగ్గడంతో రాములోరి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, గ్రామాల పెద్దలు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అన్నదాన కార్యక్రమాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని మర్పల్లి, తట్టిఅన్నారంతోపాటు అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కుత్బుల్లాపూర్, గౌరెల్లి, తారామతిపేట గ్రామాల్లో శ్రీరామనవమి కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు.
రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు
కొత్తూరు రూరల్ : సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవానికి కొత్తూరు మండలకేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం సీతారామచంద్రస్వామి కల్యాణం, చక్రస్నానం, అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిద్దాపూర్ సర్పంచ్ వడ్డె తులసమ్మ, నిర్వాహకులు తెలిపారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
శంకర్పల్లి : శంకర్పల్లి రైల్వే యార్డులోని రామాలయంలో సీతారాముల కల్యాణం ఆదివారం నిర్వహిస్తున్నట్లు రామాలయ కమిటీ అధ్యక్షుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు కల్యాణం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. సాయంత్రం 6 గం.లకు శోభాయాత్ర జరుగుతుందని తెలిపారు.
ఆలయాలు ముస్తాబు
కేశంపేట :మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో దేవాలయాలను ముస్తాబు చేశారు. ఎక్లాస్ఖాన్పేటలోని లక్ష్మీవెంటేశ్వరస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ దంపతుల చేతుల మీదుగా జరుపనున్న సీతారాముల కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండల కేంద్రంలో ఆం జనేయస్వామి దేవాలయం పునర్నిర్మాణం జరిగి 5 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో మూడు రోజులుగా పూ జా కార్యక్రమాలతో పాటు కల్యాణానికి ఏర్పాట్లు చేశారు.
ఆమనగల్లు : ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో శ్రీరామ నవమి వేడుకలకు ఆలయాలు ముస్తాబు అయ్యాయి. మండలంలోని అయ్యసాగర్ క్షేత్రం, ఆంజనేయ స్వామి దేవాలయం, కడ్తాల మండలంలోని మైసిగండిలో శివాలయం, రామాలయం, మాడ్గుల మండలంలోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో వేడుకలకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.