ధారూరు, జూన్ 30: పల్లెలు ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ధారూరు గ్రామ రూపురేఖలు మార్చింది. వికారాబాద్ జిల్లా కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ధారూరు. పల్లెప్రగతిలో భాగంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. ప్రభుత్వం సూచించిన ప్రత్యేక కార్యాచరణతో ప్రజాప్రతినిధులు, గ్రామ కమిటీ సభ్యులు, ప్రజలతోపాటు అధికారులు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. గ్రామం లో విస్తృతంగా అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామ ముఖద్వారం నుంచి రోడ్డు కు ఇరువైపులా హరితహారం మొక్కలు పచ్చని అందాలతో స్వాగతం పలుకుతున్నాయి.
ప్రతీ వీధిలో సీసీ రోడ్డు, హైమా స్ట్ లైట్లతో కొత్తకాంతులీనుతున్నది. పల్లె ప్రకృతి వనం, నర్సరీ ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. పం చాయతీ భవనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు, మిషన్ భగీరథతో నీటి సరఫరా, మురుగుదొడ్డి, ఇంకుడుగుంతల నిర్మాణంతో అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. జిల్లాలోనే మొదటి రైతు వేదికను విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్, ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి కలిసి ప్రారంభించారు.
పల్లె ప్రగతితో గ్రామాభివృద్ధి
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో రూ.11 లక్షలతో వైకుంఠధామం, రూ.1.8 లక్షలతో కంపోస్టు షెడ్డు, రూ.2 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.22 లక్షలతో రైతు వేదిక, రూ.18.5 లక్షలతో సీసీ రోడ్లు, రూ.6లక్షలతో వీధి దీపాలు, రూ.4 లక్షలతో నూతన బోరు పంపులు, రూ.6 లక్షలతో మురుగు కాల్వల నిర్మాణం, రూ.2 లక్షలతో తాగునీటి కోసం మరమ్మతులు నిర్వహించారు.
సమర్ధవంతంగా పారుశుద్ధ్య నిర్వహణ
పల్లె ప్రగతిలో భాగంగా డంపింగ్ యార్డు ఏర్పాటుచేశారు. పంచాయతీ నిధులతో ట్రాక్టర్ కొనుగోలు చేసి, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. చెత్తను వేరు చేసేందుకు ఇంటింటికీ రెండు చెత్త బుట్టలు పంపిణీ చేశారు.
ఆహ్లాదంగాపల్లె ప్రకృతి వనం, నర్సరీ
గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో 1800 మొక్కలు నాటి, వాటి చుట్టూ కంచె వేసి మధ్యలో వాకింగ్ కోసం రోడ్డు వేశారు. ప్రకృతి వనంలో చైనాబాదాం, ఆశోక, మర్రి, గానుగా, బాదాం తదితర మొక్కలు నాటి వాటిని కాపాడుతున్నారు. నర్సరీలో మొత్తం 11వేలు మొక్కలు నాటారు. అందులో టేకు, తులసీ, వామ, మందార, కరివేపాకు, గోరింటాకు, జామ, టైకోమా మొక్కలు పెంచుతున్నారు.
ఇంటింటికి మిషన్ భగీరథ :
గ్రామంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. మూడేండ్లుగా మిషన్ భగీరథ పథకంతో మంచి నీటి ఇబ్బందులు తప్పాయి.
రైతు వేదికతో సమస్యల పరిష్కారం
రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు క్లస్టర్ స్థాయిలో రైతు వేదికను రూ.22 లక్షలతో నిర్మించారు. ఈ రైతు వేదిక క్లస్టర్ పరిధిలో ధారూరు, అవుసుపల్లి, రాంపూర్, గట్టేపల్లి పంచాయతీలున్నాయి. గ్రామాల రైతులు వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారి సలహాలు, సూచనలు తెలుసుకుంటున్నారు.
గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి
గ్రామస్తుల సహకారంతో పల్లె ప్రగతి విజయవంతంగా కొనసాగింది. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, టెక్నికల్ అసిస్టెంట్ పంచాయతీ సిబ్బంది అందరూ కలిసికట్టుగా అభివృద్ధి చేసుకున్నారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతకు ఆధిక ప్రాధానత్య ఇస్తున్నాం. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నాం.
గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యం
గ్రామాభివృద్ధే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నాం. మున్ముందు గ్రామం లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మండలంలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతాం. పల్లె అభివృద్ధికి 30రోజుల ప్రణాళికతో ప్రారంభమై, అంచెలంచెలుగా అభివృద్ధికి బాటలు వేశాం. గ్రామస్తులు, వార్డు సభ్యులు, అధికారుల సమష్టి కృషితోనే అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టించాం.
-.చంద్రమౌళి, గ్రామ సర్పంచ్, ధారూరు