యాచారం, ఏప్రిల్ 1: గ్రామాభివృద్ధి కోసం చేపట్టే ప్రతి పనిని పూర్తి స్థాయి నాణ్యతతో చేపట్టాలని సీనియర్ క్వాలిటీ కంట్రోలర్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ పద్మావతి అన్నారు. మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో శుక్రవారం ఆమె పర్యటించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా చేపట్టిన సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, పల్లె ప్రకృతివనం, నర్సరీ, డంపింగ్యార్డు, కంపోస్టు యార్డులను ఆమె పరిశీలించారు. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల తరగతి గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు వాటి పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని సైతం పరిశీలించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రం పనితీరును అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వీధుల పరిశుభ్రత, సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే చేసే ప్రతి పనిలో నాణ్యత ఉండాలన్నారు. గ్రామంలో పల్లె ప్రగతి పథకం ద్వారా చేపట్టిన పనులు బాగున్నాయన్నారు. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త పడాలన్నారు. ప్రతి మొక్కను సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ఉపాధి కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎండల దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఉదయం 11.30 గంటలకు మూసి వేయాలన్నారు. అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరించుకోవాలన్నారు. గ్రామంలోని అన్ని కాలనీలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంబాలపల్లి సంతోష, టెక్నికల్ అసిస్టెంట్ మాణిక్యం, రాజు తదితరులున్నారు.