కులకచర్ల, మార్చి 31 : నీటి తొట్టెలు గ్రామాల్లో పశువుల దాహార్తిని తీరుస్తున్నాయి. వేసవిలో పశువులకు నీటిని అందించేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా నీటితొట్టెలను నిర్మించింది. ఈ నీటి తొట్టెలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. పశువులకు పశుగ్రాసంతో పాటు తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ, పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించింది. దీనిలో భాగంగా పశుసంవర్ధక శాఖ ద్వారా పశువైద్యకేంద్రాల ద్వారా రైతులకు పశుగ్రాస విత్తనాలను పంపిణీచేసేందుకు కృషిచేస్తున్నది. దీనితోపాటు గ్రామాల్లో పశువులకు దాహార్తిని తీర్చేందుకు ఉపాధిహామీ పథకం ద్వారా నీటి తొట్టెలను నిర్మిస్తున్నారు. కులకచర్ల మండలంలో 44 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా పంచాయతీకి 3నుంచి 4వరకు నీటి తొట్టెలను నిర్మించనున్నారు. పంచాయతీల్లోనే కాకుండా అనుబంధ గ్రామాల్లో నీటి తొట్టెలను నిర్మించుకునేందుకు ఉపాధిహామీ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసకుంటున్నారు. ఒక్కో నీటి తొట్టెకు రూ.22వేలు ఖర్చు అవుతున్నది. వీటిని ఉపాధిహామీ పథకం ద్వారా నిర్మించారు.
పశువుల దాహార్తి తీరుతుంది
పశువుల దాహార్తిని తీర్చడానికి నీటి తొట్టెలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గ్రామాల్లో వీటిని నిర్మించడం ద్వారా పశువులకు నీటి సమస్యను తీర్చవచ్చును. ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. రైతులకు అనుకూలంగా ఈ కార్యక్రమం చాలాబాగుంది. గ్రామాల్లో మంచినీటికి అనుకూలంగా ఉన్నచోట నీటి తొట్టెలను నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి.
– నర్సింహ, రైతు లింగంపల్లి
నీటి తొట్టెలను నిర్మించాం
పశువులకు అనుకూలంగా ఉన్నచోటే నీటి తొట్టెలను నిర్మించాం. గ్రామం పంచాయతీ తీర్మానం ప్రకారం నీటి తొట్టెల నిర్మాణం చేపట్టాం. ఒక్కొక్క నీటితొట్టెకు రూ.22వేలు ఉపాధిహామీపథకం ద్వారా మంజూరు చేసి నిర్మించాం. నేడు గ్రామాల్లో పశువులకు నీటి సమస్యను తీర్చడం జరిగింది.
– వెంకటేశ్,ఏపీవో కులకచర్ల