పూడూరు, జూన్ 26 : పూడూరు మండలం మన్నెగూడ గ్రామపంచాయతీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నది. సీసీ రోడ్డు, వైకుంఠధామం మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టారు. చెత్త సేకరణకు ప్రభుత్వం ట్రాక్టర్‌ను ఇవ్వడంతో గ్రామంలో ప్రతి రోజు చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీటిని అందజేస్తున్నారు. ప్రకృతివనం, నర్సరీలను ఏర్పాటు చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణ, వీధి రోడ్ల వెంట నాటిన మొక్కలు పచ్చని చెట్లుగా దర్శనమిస్తున్నాయి. పాడుబడ్డ ఇండ్లను తొలగించారు. పల్లె ప్రగతితో గ్రామ రూపురేఖలు మారుతున్నాయి.
మన్నెగూడ గ్రామపంచాయతీ హైదరాబాద్-బీజాపూర్ హైవే రోడ్డు పక్కనే ఉండగా.. వికారాబాద్‌కు 10 కి.మీ దూరంలో ఉంది. గ్రామ జనాభా 2450, నివాసాలు 505, ఓటర్లు 1530 మంది ఉన్నారు. అక్షరాస్యత 80 శాతం ఉండగా, 18 సంవత్సరాలు నిండిన నిరక్షరాస్యులు 250 మంది. ఇక్కడి యువత చాలావరకు మన్నెగూడ చౌరస్తాలో చిరు వ్యాపారాలు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని మన్నెగూడ-పరిగి వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో రూ.12.50లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. పనులు పూర్తి కావడంతో త్వరలోనే ప్రారంభించనున్నారు. వికారాబాద్‌కు వెళ్లే రోడ్డు నుంచి మసీదు మీదుగా గ్రామంలోకి రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులు, ఒక కారోబార్, ఒక అటెండర్, ఇద్దరు వాటర్‌మెన్ పనిచేస్తున్నారు. సంవత్సరం క్రితం పంచాయతీకి నూతన ట్రాక్టర్‌ను రూ.10లక్షలతో కొనుగోలు చేయడంతో కార్మికులు ప్రతి రోజు చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గతంలో వీధుల్లో చెత్తాచెదారం ఉండగా.. పల్లె ప్రగతి ద్వారా గ్రామం పరిశుభ్రంగా మారింది.
ఇంటింటికీ మిషన్ భగీరథ
గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీటి నల్లా కనెక్షన్ ఇచ్చి నీరు సరఫరా చేస్తున్నారు. ఒకవేళ సమస్య తలెత్తితే గ్రామంలో ఉన్న 9 మంచి నీటి బోరు మోటార్ల నీటి సరఫరా చేస్తున్నారు. మన్నెగూడ చౌరస్తాలో, గ్రామంలో నిరంతరం మంచి నీటి సౌకర్యం కల్పించడం వల్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
1.24లక్షలతో పల్లె ప్రకృతి వనం
పల్లె ప్రకృతి వనం కోసం ఎకరం భూమి కేటాయించగా.. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.1.24లక్షల నిధులు పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి విడుదల చేశారు. పార్కులో రకరకాల పూల మొక్కలు, తులసి, అశోక, జామ, మామిడి, టేకు వంటి మొక్కలను నాటించారు. పార్కులో దారిని, వచ్చిన వ్యక్తులు కూర్చునేలా బెంచీలను స్థానిక నాయకుడు సయ్యద్ ఆదిల్ రూ.85వేలతో సమకూర్చారు. పార్కులో ప్రతి రోజు మొక్కలకు నీరు పట్టేందుకు ఇద్దరు పని చేస్తున్నారు. వారికి ఉపాధి హామీ ద్వారా కూలీ డబ్బులు చెల్లిస్తున్నారు.
గ్రామాభివృద్ధికి కృషి : మాణిక్యం, పంచాయతీ కార్యదర్శి, మన్నెగూడ
గ్రామపంచాయతీలో సీసీ రోడ్డు, మురుగు కాల్వలను నిర్మించాం. పల్లె ప్రగతి ద్వారా శ్మశానవాటిక, డంపింగ్ యార్డు, కంపోస్టు షెడ్డు, పార్కు నిర్మాణాలు పూర్తి చేశాం. పల్లె ప్రకృతి వనం ద్వారా గ్రామంలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. పల్లె ప్రగతిని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టడంతో గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతతో పాటు గ్రామాలు అభివృద్ధి దిశలో ముందుకు సాగుతున్నాయి.