వికారాబాద్, డిసెంబర్ 21 : ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయజ్ఞం 162 మంది వేద పండితులతో 7 రోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. వికారాబాద్‌లోని చిగుళ్లపల్లి గ్రౌండ్లో బుధవారం అతిరుద్ర మహాయజ్ఞం పూజలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 నుంచి 27వరకు జరిగే ఈ యజ్ఞం వికారాబాద్‌లో నిర్వహించడం ఈ ప్రాంత ప్రజలు అదృష్టంగా భావించాలని ఆధ్యాత్మిక సేవా మండలి సభ్యులు తెలిపారు.
మహాశివుడి ఆశీస్సులతో యజ్ఞం జరిపించడంతో ప్రజలకు శాంతి కలుగుతుందని పేర్కొన్నారు. ఈ యజ్ఞానికి వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ఎస్పీ కోటిరెడ్డి హాజరయ్యారు. యజ్ఞానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆధ్యాతిక సేవా మండలి వారు తగు ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తు నిర్వహించారు. జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్ యజ్ఞంలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.