పెద్దఅంబర్‌పేట, డిసెంబర్ 17 : ‘నా చిట్టితల్లి.. ఈ జడ్జి డ్రెస్‌లో ఎంత ముద్దొస్తుందో.. ఓ తల్లి మురిపెం..’ ‘నా బంగారు కొండ.. అచ్చుగుద్దినట్టు పోలీస్లాగే ఉన్నడు.. నా దిష్టే తగిలేలా ఉన్నది’ ఓ తండ్రి సంబురం. చిన్నారుల ఫస్ట్ బర్త్‌డేకు ముందు ఫొటో షూట్ల వేళ తల్లిదండ్రుల ఆనందం ఇది. ఇలా ఒక్కటి కాదు.. రెండు కాదు పదుల సంఖ్యలో విభిన్నంగా చిన్నారుల ఫొటోలు తీయిస్తున్నారు. ఫస్ట్ బర్త్‌డేకు ముందు ఫొటో షూట్ తీయించడం ప్రస్తుతం నయా ట్రెండ్. క్రీడాకారులు, ఉద్యోగుల తదితర వేషధారణల్లో చిన్నారులను ముస్తాబు చేస్తూ సంతోష పడుతున్నారు. ఇందుకోసం రూ.వేలలో ఖర్చు చేస్తూ జ్ఞాపకాలను పదిలం చేసుకుంటున్నారు. వాటిని తనివితీరా ఆస్వాదిస్తూ ఆనందమానంద మాయే అంటూ తెగ మురిసిపోతున్నారు.
చిన్నారులకు సంబంధించి ప్రతి అడుగు ఒక సంబురమే. ప్రతి కార్యక్రమం ఓ ఉత్సవమే. వారి ప్రతి సందర్భం తల్లిదండ్రులకు అమితానందమే. అందుకే పిల్లలకు సంబంధించినంత వరకు ప్రతి సందర్భాన్ని ఓ తీపి జ్ఞాపకంగా మలుచుకునేందుకు యువ తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. పిల్లల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు.. మరెన్నో కలలు.. అన్నింటినీ నిజం చేసుకునే తరుణంలో ఎదురయ్యే ప్రతి క్షణాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్నారు. వారి సంతోషాలను జ్ఞాపకాలుగా మారుస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి పుట్టిన రోజుకు ముందు పిల్లలకు ఫొటో షూట్లు తీయించడం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ట్రెండ్ అయ్యింది. ఇందుకోసం ప్రత్యేకంగా సమయానికి కేటాయిస్తున్నారు. ఖర్చుకు సైతం వెనుకాడటం లేదు.
ప్రదేశాలు నచ్చి.. దుస్తులు తెచ్చి..
ఫస్ట్ బర్త్‌డేకు ముందు ఫొటో షూట్ కోసం కేవలం ఫొటోగ్రాఫర్లకే రూ.10 వేల నుంచి రూ.40 వేలు ఇచ్చేందుకు సైతం తల్లిదండ్రులు వెనుకాడటంలేదు. అయితే ఇది కేవలం ఫొటోలు తీసేందుకు మాత్రమే. ఇదీకాక పలు అందమైన ప్రదేశాలను ముందే ఎంపిక చేసుకుంటున్నారు. ఇందుకోసం ఇంటర్నెట్లో తెగ శోధిస్తున్నారు. అందులో నుంచి కొన్ని ప్రదేశాలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆపై అక్కడ చిన్నారులను విభిన్నంగా ఫొటోలు తీయిస్తున్నారు. ఒక్కో తల్లిదండ్రి పిల్లలకు కనీసం ఆరు నుంచి పది జతల బట్టలు తీసుకుంటున్నారు. పిల్లలను అందంగా చూపించేందుకు ఆరాటపడుతున్నారు.
రేటుకు ఫిక్సయితే అన్నీ ఒకేచోట..
ఫొటో షూట్ కోసం పిల్లలను సిద్ధం చేయడం అంటే అదో యుద్ధమే జరుగుతుందనుకోవాలి. అయినప్పటికీ అందుకు తగ్గట్టు ఎక్కువ సమయం కేటాయించేందుకు నేటి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఫొటో షూట్‌కు ముందు కనీసం వారంపాటు షాపింగ్ చేసేస్తున్నారు. దుస్తులు మొదలు కాస్ట్యూమ్స్ వరకు అన్నీ కొనుగోలు చేస్తున్నారు. వాటన్నింటితో పిల్లలను రెడీ చేస్తున్నారు. కాస్ట్యూమ్స్ ఖరీదైనా తగ్గేదేలే అంటున్నారు. నచ్చిన ప్రదేశాల్లో ఫొటో షూట్ చేయిస్తున్నారు. అటు పిల్లలు అలసిపోకుండా చూసుకుంటూనే.. అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఫొటోల్లో ప్రకృతి అందాలు కనిపించేలా చూసేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు, ప్రీ బర్త్‌డే ఫొటో షూట్లు చేసేవారు చాలామందే ఉంటున్నారు. ఫొటోషూట్ కోసం ఒక్క డ్రెస్‌లు కొనుక్కుంటే చాలు మిగతావన్నీ వాళ్లే ఏర్పాటు చేస్తారు. అందుకు కొంత ఫీజు వసూలు చేస్తారు. కొన్ని డ్రెస్‌లు సైతం అద్దెకు వాళ్లే సమకూరుస్తారు. కొందరు తమ పిల్లలను లాయర్లుగా సిద్ధం చేయాలనుకుంటారు.
ఇంకొందరు డాక్టర్లుగా, పోలీస్‌లుగా సిద్ధం చేస్తుంటారు. అక్కడకు కేవలం డ్రెస్‌లు తీసుకెళ్తే చాలు మిగతా అన్ని సదుపాయాలు ఫొటోషూట్ల వారే కల్పిస్తున్నారు. తమ పిల్లలు గొప్పగా ఎదగాలని ఆకాంక్షిస్తూ పోలీస్, జడ్జీల వేషధారణలో తయారు చేస్తూ ఫొటోలు తీయిస్తున్నారు. మరికొందరు ఫన్నీగా ఫొటోలు తీయిస్తున్నారు. వాటిని చూసి మురిసిపోతున్నారు. డ్రెస్‌లు కాకుండా మిగతా సదుపాయాలు కల్పిస్తున్న కొన్ని సంస్థలు గంటలకు చొప్పున ఫీజు వసూలు చేస్తున్నాయి. కనీసం నాలుగు గంటలకు రూ.8 వేల నుంచి 20 వేల వరకు రేట్లు ఫిక్స్ చేశాయి. కొందరు 8 గంటల వరకు సమయం తీసుకుంటారు. పిల్లలను రెడీ చేసేందుకు ఎక్కువ సమయమే పడుతుంది. అందుకోసం రేటు ఎక్కువైనా అధిక సమయం తీసుకుంటున్నారు. మరికొన్ని ప్రత్యేక ఫొటోల కోసం మరింత చెల్లించేందుకు వెనుకాడటంలేదు. పిల్లల ఫొటోలను తీపి జ్ఞాపకాలుగా మలుచుకునేందుకు తల్లిదండ్రులు ఎంత ఖర్చయినా పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఫొటోలను ఆల్బమ్‌లుగా మలుస్తున్నారు. వాటిని సోషల్‌మీడియాలో పెడుతూ బంధువులకు షేర్ చేస్తూ మురిసిపోతున్నారు. ఇంకొందరు కష్ట సమయాల్లో పిల్లల ఫొటోలను చూస్తూ బాధలను మరిచిపోతున్నారు.