ఆమనగల్లు, డిసెంబర్ 17 : ఆమనగల్లులో త్వరలో దుకాణ సముదాయం (షాపింగ్ కాంప్లెక్స్) నిర్మాణం చేపడుతామని ఎంపీపీ నేనావత్ అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుకభాగంలో ఉన్న మండల పరిషత్ కార్యాలయానికి సంబంధించిన స్థలాన్ని శనివారం జడ్పీటీసీ అనురాధ, ఏఈ కృష్ణయ్యతో కలిసి చదును చేపించి హద్దురాళ్లను పాతించారు. పినిషింగ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల పరిషత్ ముందు భాగంలో హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిని, షాద్నగర్ రహదారిని అనుసరించి అదే విధంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వెనుక భాగంలో ఉన్న స్థలం చుట్టూ మూడు వైపులా దుకాణాలను నిర్మిస్తామని తెలిపారు. ఇటీవల జడ్పీ సీఈవో ఆయా స్థలాలను పరిశీలించి ప్రతిపాదనలు పంపించాలని కోరినట్లు తెలిపారు. ఇప్పటికే ఇంజినీరింగ్ అధికారులతో డిజైన్ రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరు కాగానే నిర్మాణ పనులను మొదలు పెడుతామని వివరించారు. కార్యక్రమంలో మండల పరిషత్ సూపరింటెండెంట్ రమేశ్ నాయక్ పాల్గొన్నారు