వికారాబాద్, డిసెంబర్ 13, (నమస్తే తెలంగాణ);ప్రతి సంవత్సరం ఓటరు నమోదు, చేర్పులు, మార్పులు, సవరణలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం ఇస్తున్నది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు దరఖాస్తులను స్వీకరించగా 14,223 వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 26 వరకు నియోజకవర్గాల వారీగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి, జనవరి 5న ఓటరు తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఓటరు ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 1130 పోలింగ్ కేంద్రాలుండగా, 8,71,746 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు-4,37,274 మంది, మహిళలు-4,34,447 మంది, ఇతరులు-25 మంది ఓటర్లు ఉన్నారు. తుది జాబితాలో కొత్తగా నమోదైన వారితో ఓటర్ల సంఖ్య పెరుగనున్నదని అధికారులు పేర్కొన్నారు.
కొత్త ఓటరు నమోదుతోపాటు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి గడువు ముగిసింది. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు కొత్తగా ఓటరు నమోదుతోపాటు మార్పులు, చేర్పులకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశమిచ్చింది. ప్రతి ఏటా ఓటరు జాబితా ముసాయిదా విడుదల అనంతరం ఓటరు నమోదుకు, మరణించిన లేదా శాశ్వతంగా నివాసం మార్చిన వ్యక్తి పేరును ఓటరు జాబితా నుంచి తొలగించుటకు, ఓటరు జాబితాలో పేరు సవరించుకునేందుకు, ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో నివాసం మార్చుకున్నా, నివాసాన్ని కొత్త నియోజకవర్గంలోకి మార్చుకున్నట్లయితే సవరణలకు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశమిస్తున్నది.
నియోజకవర్గాలవారీగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ
జిల్లాలో గత 69 రోజుల్లో కొత్త ఓటరు నమోదుతోపాటు మార్పులు, చేర్పులకు 14,223 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా కొడంగల్ నియోజకవర్గంలో 4843, తాండూరులో 3827, పరిగిలో 3154, వికారాబాద్లో 2399 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత దరఖాస్తుల్లో సుమారు 10 వేలకుపైగా దరఖాస్తులు కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. కొత్త ఓటరు నమోదుతోపాటు మార్పులు, చేర్పుల నిమిత్తం వచ్చిన దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 26 వరకు నియోజకవర్గాలవారీగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి, జనవరి 5న ఓటరు తుది జాబితాను విడుదల చేయనున్నారు.