షాద్‌నగర్‌టౌన్, నవంబర్ 26: ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యతని మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. పట్టణంలోని పద్మావతికాలనీ జిల్లా పరిషత్ కుంట ఉన్నత పాఠశాలలో ఓటు నమోదు కార్యక్రమాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏండ్లు నిండిన యువత ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. అదే విధంగా మున్సిపాలిటీలోని 16వ వార్డులో నిర్వహించిన ఓటు నమోదు కార్యక్రమాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్ పరిశీలించారు. కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు కిశోర్, నాయకులు నందకిశోర్, ఉపాధ్యాయులు, బీఎల్వో సిబ్బంది పాల్గొన్నారు.
ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
కేశంపేట : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్‌రావు సూచించారు. కేశంపేట మండల కేంద్రంలోని పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం ఓటు హక్కు కోసం దరఖాస్తులను స్వీకరించారు. ఓటు హక్కు నమోదుతో పాటు పేర్ల మార్పులు, బూత్ మార్పు, తప్పుల సవరణలు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బీఎల్వో శివ, మల్లేశ్ పాల్గొన్నారు.
కడ్తాల్ : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ మురళీకృష్ణ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలతో పాటు ఆయా గ్రామాల్లో నిర్వహించిన ఓటు నమోదు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని రెవెన్యూ సిబ్బందితో కలిసి తహసీల్దార్ పరిశీలించారు