ఆపద సమయంలో అంబులెన్సులు బంధువులా సేవలందిస్తున్నాయి. బాధితులు ఫోన్ చేసిన వెంటనే చెంతకు చేరుకుని ప్రభుత్వ దవాఖానలకు తరలిస్తున్నాయి. ఒక్కో వాహనంలో పైలట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉండడంతో పాటు ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్స అందించడంతో పాటు ఆక్సిజన్ మెడిసిన్స్, బ్లడ్ గ్లూకోజ్ లెవల్ ఏఈడీ, బీపీఆపరేటర్, పల్స్ పరీక్షించడానికి ఆధునిక వైద్య పరికరాలతో పాటు ప్రసవం చేయడానికి ఎమర్జెన్సీ డిస్పోజబుల్ డెలివరీ కిట్‌ను అందుబాటులో ఉంచారు. గడిచిన పది నెలల్లో 30వేల మందికి సేవలందించిన అంబులెన్స్‌లు సంజీవనిలా పని చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 27 అంబులెన్సులు ఉండగా, 135 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు.
– ఇబ్రహీంపట్నం, నవంబర్ 15
ఇబ్రహీంపట్నం, నవంబర్ 15 : రోడ్డు ప్రమాదం జరిగినా.. గుండె నొప్పి వచ్చినా.. పురిటినొప్పులతో ఉన్న గర్భిణులను ప్రసవానికి తీసుకెళ్లాలన్నా 108 వాహనాలు సంజీవినిగా పనిచేస్తున్నాయి. అనేకమంది ప్రాణాలను కాపాడుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫోన్ చేస్తే క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి.
జిల్లావ్యాప్తంగా 27 అంబులెన్సులు
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 19 అంబులెన్సులతోపాటు మంత్రి కేటీఆర్ గతేడాది గిఫ్ట్ ఏ స్మైల్ కింద 8 అంబులెన్స్‌లను అందజేశారు. మొత్తంగా జిల్లాలో 108 వాహనాలు 27 అందుబాటులో ఉన్నాయి. గడిచిన పది నెలల్లో ఈ వాహనాల ద్వారా 30వేల మందికి వివిధ రకాల వైద్య సేవలందించినట్లు 108 జిల్లా ఇన్చార్జి రమేశ్ తెలిపారు. ప్రతి నెలా 3వేలమందికి సేవలందిస్తుండగా.. ఇందులో 700 మందికి పైగా గర్భిణులే ఉంటారని.. వీరిని సరైన సమయంలో దవాఖానలకు తరలించి ప్రసవాలు చేయించడంతోపాటు అత్యవసరమైతే అంబులెన్స్ సిబ్బంది ద్వారానే సాధారణ ప్రసవాలు చేస్తున్నట్లు తెలిపారు. 108 అంబులెన్స్‌లో ఒక్కో వాహనంలో పైలట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అందుబాటులో ఉంటూ షిప్టుల వారీగా సేవలందిస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
135 మంది సిబ్బంది
జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న 108 అంబులెన్సుల్లో 135 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. షిప్టులవారీగా విధులు నిర్వహిస్తున్న వీరిలో 68 మంది పైలట్లు, 62 మంది ఈఎంటీలతోపాటు మరో ఐదుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. ఫోన్ చేస్తీ క్షణాల్లో బాధితుల వద్దకు చేరుకుని దవాఖానలకు తరలిస్తున్నారు.
అంబులెన్సుల్లో ప్రత్యేక సేవలు..
అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్స అందించడంతోపాటు ఆక్సిజన్, మెడిసిన్స్, బ్లడ్ గ్లూకోజ్ లెవల్ ఏఈడీ, బీపీ ఆపరేటర్, పల్స్ పరీక్షించడానికి ఆధునిక వైద్య పరికరాలతోపాటు ప్రసవం చేయడానికి ఎమర్జెన్సీ డిస్పోజబుల్ డెలివరీ కిట్‌ను అందుబాటులో ఉంచారు. జిల్లాలో అన్ని 108 వాహనాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ప్రసవాలు చేసే సమయంలో ఇబ్బందులు కలిగితే మానిటర్ ద్వారా కాల్ సెంటర్లోని ఈఆర్పీని సంప్రదించి రోగి పరిస్థితిని తెలుసుకుని అవసరమైర వైద్య సలహాల మేరకు చికిత్స అందిస్తున్నారు.
అత్యవసర సేవలు అందిస్తున్నాం
– రమేశ్, 108 రంగారెడ్డిజిల్లా ఇన్చార్జి
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అత్యవసర సమయాల్లో వినియోగించాల్సిన వైద్య పరికరాలతోపాటు సిబ్బందికి పరిజ్ఞానాన్ని అందించారు. అత్యవసర సమయాల్లో ప్రసవాలు చేయడంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో గడిచిన 10 నెలల్లో సుమారు 30వేలమందికి వివిధ రూపాల్లో 108 అంబులెన్సుల ద్వారా సేవలందించాం.
ఈఎంటీ, పైలట్లకు శిక్షణ
జీఎన్ఎం, ఎన్ఎంలుగా సైన్స్ గ్రూప్వారినే ఈఎంటీలుగా ఎంపిక చేస్తారు. వీరికి 45 రోజులపాటు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ప్రమాదాల్లో గాయపడినవారికి, గర్భిణులకు ప్రసవాలకు సంబంధించి చికిత్సపై అవగాహన కల్పిస్తున్నారు. అనంతరం 15 రోజులు ప్రభుత్వ దవాఖానల్లో శిక్షణ ఇప్పిస్తారు. తర్వాత అంబులెన్సుల్లో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.