ఇబ్రహీంపట్నం, నవంబర్ 7 : రంగారెడ్డిజిల్లాలోని గనులు, భూగర్భవనరుల శాఖల నుంచి ప్రభుత్వానికి ఏటా గణనీయంగా ఆదాయం పెరుగుతున్నది. జిల్లాలో ఉన్న ఖనిజ సంపదను నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న భవననిర్మాణాలకు పెద్దఎత్తున వినియోగిస్తున్నారు. దీంతో రంగారెడ్డిజిల్లా నుంచి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఏటా పెరుగుతున్నది. జిల్లాలో 51 పలుగురాళ్లు, 78 కంకర, 2 ఎర్రమట్టి, 15 గ్రానైట్ క్వారీలున్నాయి. వీటి నుంచి ప్రభుత్వానికి రాయల్టీ రూపేణా వస్తున్న ఆదాయంతోపాటు అదనంగా మరో 30 శాతం జిల్లా ఖజానాకు చేరుతుంది. గత సంవత్సరం ఈ క్వారీల నుంచి ప్రభుత్వానికి రూ.98 కోట్లు రాగా.. ఈ ఏడాది ఏడు నెలల్లోపే రూ.94 కోట్ల ఆదాయం సమకూరినట్లు జిల్లా గనులు, భూగర్భశాఖ అధికారులు తెలిపారు. మరో ఐదు నెలల్లో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశమున్నదని తెలిపారు.
గత ఏప్రిల్ నుంచి కొత్త ధరలు అమలులోకి..
గనులు, భూగర్భ క్వారీల నుంచి ఉత్పత్తులపై పెరుగుతున్న ధరలకనుగుణంగా గత ఏప్రిల్ నుంచి కొత్త ధరలు అమలులోకి రావడంతో ఈ ఆదాయం మరింత పెరుగుతున్నది. క్వారీల నుంచి ప్రతినిత్యం నగరానికి పెద్దఎత్తున ముడిసరుకును తరలిస్తున్నారు. జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్, చేవెళ్ల, శంషాబాద్, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం తదితర మండలాల్లో స్టోన్ క్రషర్లు అధికంగా ఉన్నాయి. వీటినుంచి పెద్దఎత్తున భవన నిర్మాణానికి అవసరమైన కంకరను ఉత్పత్తులు చేస్తున్నారు. యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలను ఇప్పటికే ప్రభుత్వం మైనింగ్జోన్ల కింద ప్రకటిండంతో ఇటీవల ఈ మండలాల్లో పెద్దఎత్తున స్టోన్ క్రషర్లు ఏర్పాటవుతున్నాయి. చేవెళ్ల నియోజకవర్గంలోని పలుచోట్ల నుంచి పలుగురాయిని గ్రానైట్ పరిశ్రమలకు తరలిస్తున్నారు. గ్రానైట్ పరిశ్రమల నుంచి కూడా ప్రభుత్వానికి ఆదాయం మరింత పెరుగుతున్నది.
జరిమానాల రూపంలో మరో రూ.99 లక్షలు
జిల్లాలో భూగర్భవనరులు, గనుల నుంచి పెద్దఎత్తున అక్రమ రవాణా జరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని గనులు, భూగర్భశాఖ అధికారులు విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో రూ.99లక్షల పెనాల్టీ ద్వారా జిల్లాకు నిధులు సమకూరాయి. ముఖ్యంగా జిల్లా నుంచి అక్రమంగా మట్టి తరలింపు పెద్దఎత్తున జరుగుతున్నది. అనుమతులు లేకుండా మట్టి అక్రమ తరలింపుపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. స్టోర్ క్రషర్ల నుంచి కూడా అక్రమ రవాణా జరుగుతున్నది. వీటన్నింటిపై గనులు, భూగర్భశాఖలతోపాటు టాస్క్‌ఫోర్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఈ సంవత్సరం ఇప్పటివరకు రూ.99 లక్షల పెనాల్టీలు విధించారు. జిల్లా నుంచి అక్రమంగా తరలించే మట్టి, కంకర, పలుగురాళ్లు తదితర వాటిని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
మరింత ఆదాయాన్ని పెంచేందుకు కృషిచేస్తాం : ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, గనులు, భూగర్భశాఖల సహాయ సంచాలకుడుజిల్లా నుంచి గనులు, భూగర్భశాఖ నుంచి మరింత ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో పెద్దఎత్తున ఖనిజసంపద ఉంది. దీనిద్వారా ఎలాంటి అక్రమాలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతాం. అక్రమ మైనింగ్ వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటాం. దీన్ని అరికట్టడానికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశాం.