రంగారెడ్డి, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : సాధారణంగా చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధుల నివారణకు టీకాల కార్యక్రమాన్ని సోమవారం నుంచి ఈ నెల 19 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు తెలిపారు. సోమవారం నర్కుడలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో టీకాలు వేసేందుకు డీఎంఅండ్‌హెచ్‌వో ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాణాంతకమైన డిఫ్తీరియా (కంఠ వాతం), టెటానస్ (ధనుర్వాతం) వ్యాధుల నుంచి పిల్లలను రక్షించడానికి ఈ టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు జిల్లాలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చి, జిల్లాలోని పది నుంచి పదహారేళ్ల పిల్లలందరికీ టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి వారిని కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ టీకాల కార్యక్రమాన్ని పాఠశాలలు, గురుకులాలు, కళాశాలల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పిల్లల తల్లిదండ్రులకు దీనిపై అవగాహన లేక టీకాలు వేయించడం లేదన్నారు. దీంతో ఎంతో మంది పిల్లలు వ్యాధుల బారినపడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. పారా మెడికల్ సిబ్బంది జిల్లావ్యాప్తంగా కళాశాల, పాఠశాలల వద్దనే టీకాలు వేస్తున్నట్టు ఆయన తెలిపారు. టీకాలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 2,682 మంది పిల్లలను గుర్తించినట్లు తెలిపారు.
ఆమనగల్లు ప్రభుత్వ దవాఖాన సందర్శన
ఆమనగల్లు : రాష్ట్రంలో ఈ నెల 7 నుంచి 19 వరకు చిన్నారులకు డిఫ్తీరియా, ధనుర్వాతం నివారణకు డీటీ టీకా వేస్తున్నట్లు జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ గీత తెలిపారు. ఆమనగల్లు ప్రభుత్వ దవాఖానను ఆమె సోమవారం సందర్శించారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో ఆమె సమావేశమయ్యారు. ఆమనగల్లు మండలంలో 10 నుంచి 16 ఏండ్ల చిన్నారులు ఎంతమంది ఉన్నారో ఆరా తీశారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1174 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో టీకా వేయడాన్ని ప్రారంభించారు. 339 మందికి టీకా వేశారు. కార్యక్రమంలో వైద్యురాలు జయశ్రీ, సూపర్వైజర్ తిరుపతిరెడ్డి, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.